News

కావాలనే కొందరు విదేశాల్లో భారత్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు: ఉపరాష్ట్రపతి

88views

ప్రపంచంలోనే భారతదేశం అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యం గలదని.. కానీ, కొంతమంది పనిగట్టుకుని దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​కర్ అన్నారు. డిబ్రూఘర్​ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ఆఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ హక్కులను అనుభవించడం లేదని.. తప్పుడు మాటలను వ్యాప్తి చేయడం ద్వారా కొందరు విదేశాల్లో భారతదేశ ప్రజాస్వామ్య ప్రతిష్టను దెబ్బతీసేలా యత్నిస్తున్నారని అన్నారు.

”అంతా సజావుగా సాగుతున్నప్పుడు, కొందరు మన ప్రజాస్వామ్యాన్ని ఎందుకు కించపరుస్తారు. మనకు ప్రజాస్వామ్య విలువలు లేవని విదేశాల్లో, దేశంలో ఎందుకు మాట్లాడాలి?. నేను విశ్వాసంతో… వైరుధ్యాలకు భయపడకుండా ధైర్యంగా చెప్పగలను. ఈ తేదీన ఈ గ్రహం మీద భారతదేశంలో అత్యంత శక్తివంతమైన క్రియాత్మక ప్రజాస్వామ్యం కలదు”అని ధన్​కర్​ ఎవరి పేరు చెప్పకుండా విమర్శలు గుప్పించారు.

అటువంటి వినాశకరమైన, చెడు వార్తలను మొగ్గలోనే తుంచేయడానికి ఓ మంచి మార్గాన్ని కనుగొనాలని ఉపరాష్ట్రపతి యూనివర్సిటీ విద్యార్థులను కోరారు. విద్యార్థులు, యువత, మేధావులు, మీడియా దేశానికి రాయబారులుగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ మధ్య కాలంలో లండన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ భారతదేశాన్ని విమర్శించారనే ఆరోపణలు వచ్చాయి. అమెరికాతో సహా దేశం వెలుపల ఉన్న కొన్ని విశ్వవిద్యాలయాల నుండి ఇటువంటి తప్పుడు కథనాలు వెలువడుతున్నాయని, ఇక్కడ కొంతమంది భారతీయ విద్యార్థులు.. అధ్యాపకులు తమ దేశాన్ని విమర్శిస్తున్నారని ఈ సందర్భంగా ధన్​ఖర్​ అన్నారు.