
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర తేదీలను పూజారులు ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. 2024 ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ పంచమి (బుధవారం) రోజున మండ మెలగడం, గుడి శుద్ధీకరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అదేరోజు సాయంత్రం ఆరు గంటలకు శ్రీ సారాలమ్మ అమ్మవారు, గోవిందరాజు దేవుడు, పగిడిద్ద రాజు దేవుడు, వారివారి గద్దెల మీదకు చేరుకుంటారు. ఫిబ్రవరి 22న మాఘ శుద్ధ త్రయోదశి (గురువారం) రోజు శ్రీ సమ్మక్క అమ్మవారు సాయంత్రం 6 గంటలకు గద్దె మీదకు చేరుకుంటుంది. ఫిబ్రవరి 23న మాఘ శుద్ధ చతుర్దశి (శుక్రవారం) నాడు శ్రీ సమ్మక్క సారాలమ్మ దేవతలకు, శ్రీ గోవిందరాజులు, శ్రీ పగిడిద్ద రాజులు దేవుళ్లకు భక్తులు మొక్కులు చెల్లిస్తారు.
ఫిబ్రవరి 24న మాఘ శుద్ధ పౌర్ణమి (శనివారం) నాడు శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతలు, శ్రీ గోవిందరాజులు, శ్రీ పగిడిద్ద రాజులు దేవుళ్లు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. జాతర ముగిసిన తర్వాత 28వ తేదీన (మాఘ బహుళ పంచమి) తిరుగువారం నిర్వహించాలని ఆలయ పూజారులు నిర్ణయించారు. ఇదిలా ఉంటే.. ఈ సారి జాతరకు కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత జాతర సమయంలో కరోనా ప్రభావం ఉండడంతో ఈ సారి భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది.