
విద్వేషపూరిత ప్రసంగాలు ఉన్నాయన్న కారణంగా ‘ద కేరళ స్టోరీ’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషనుపై విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ 1.60 కోట్ల వ్యూస్ సాధించినట్లు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, మరో న్యాయవాది నిజాం పాషా మంగళవారం జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నల ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సినిమా ఘోరమైన ద్వేషపూరిత ప్రసంగాల ప్రచారమని నిజాం పాషా పేర్కొన్నారు. ”ద్వేషపూరిత ప్రసంగాల్లో పలు రకాలు ఉంటాయి. ఈ సినిమాకు సెన్సార్‌బోర్డు సర్టిఫికెటు ఇచ్చింది. కాబట్టి, దీన్ని వ్యక్తిగత ప్రసంగం కింద పరిగణించలేం. ఒకవేళ మీరు సినిమా విడుదలను సవాలు చేయదలచుకుంటే తగిన వేదిక మీద సెన్సార్ సర్టిఫికెటును సవాలు చేయాలి” అని న్యాయవాదిని ఉద్దేశించి ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ మొదట హైకోర్టును ఆశ్రయించాలని, ఇలాగైతే ప్రతిఒక్కరూ సుప్రీంకోర్టుకు వస్తారంటూ జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు.