News

శ్రీశైలంలో ఆన్‌లైన్‌ టిక్కెట్ల విధానంతో అదనపు భారం

247views

శ్రీశైలంలో స్వామి, అమ్మవార్ల సేవకు వచ్చే వారి సౌకర్యం కోసం దేవస్థానం వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇందులో నమోదు చేసుకోవాలంటే అదనపు చార్జీలు చెల్లించుకోవాల్సిందే. ఆర్జిత సేవ టికెట్ల స్థాయిని బట్టి ఒక్కో దానిపై దాదాపు రూ.150 అదనపు బాదుడు తప్పడం లేదు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తుల ద్వారా నెలకు కోట్ల రూపాయలను హ్యాండ్లింగ్‌ చార్జీల పేరిట దేవస్థానం వసూలు చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఇంత చెల్లించినా ఈ వెబ్‌సైట్‌లో దేవస్థానం సేవల సమాచారం అరకొరగానే ఉంటోంది.

శ్రీశైల దేవస్థానం భక్తులకు ఏడాదిన్నర కింద వెబ్‌సైట్‌ సౌకర్యం కల్పించింది. దీని ద్వారా భక్తులు దర్శనం, ఆర్జిత సేవా టిక్కెట్లు, వసతి గదులు తదితర సౌకర్యాలను పొందవచ్చు. ఈ సేవలకు అదనంగా చెల్లించక తప్పడం లేదు. ఉదాహరణకు అభిషేకం టికెట్‌ రుసుము రూ.5000 వేలు అయితే దీనిపైన హ్యాండ్లింగ్‌ చార్జీల పేరిట రూ.150 అదనంగా భక్తులు చెల్లించాల్సి వస్తోంది. శ్రీశైలానికి రోజూ వేలమంది భక్తులు వస్తుంటారు. వారాంతాలు, పర్వదినాల్లో ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఒక టికెట్‌ పైన ఈ స్థాయిలో అదనంగా వసూలు చేస్తున్నారంటే.. లక్షల సంఖ్యలో వచ్చే భక్తుల నుంచి తీసుకునే అదనపు ఛార్జీల విలువ కోట్లలో ఉంటుందని అంచనా. ఇక దీనికి తోడు వసతి గదులను కేటాయించే సమయంలో కూడా జీఎస్‌టీ చార్జీలు, వెబ్‌సైట్‌ నిర్వహణ చార్జీలంటూ అదనంగా వసూలు చేయడం గమనార్హం. భక్తులకు మెరుగైన సేవలందించాల్సిన దేవస్థాన అధికార యంత్రాంగం కమర్షియల్‌గా ఆలోచించి భక్తులను దోచుకుంటోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

భక్తులకు ఇబ్బంది..

శ్రీశైల దేవస్థానం ప్రవేశపెట్టిన వెబ్‌సైట్‌ నుంచి సేవల టికెట్లను రెండు, మూడు నెలల ముందుగానే బుక్‌ చేసుకోవచ్చునని భక్తులు ఆశించారు. ఆచరణలో టికెట్ల బుకింగ్‌ కేవలం పదిహేను రోజులకే పరిమితం చేశారు. పైగా ఈ సమాచారం కూడా పూర్తిస్థాయిలో అందు బాటులో ఉండటం లేదు. అసలు ఫలానా రోజు ఫలానే సేవకు ఎన్ని టికెట్లు కేటాయిస్తున్నారు? ఆన్‌లైన్‌ ద్వారా ఎన్ని టిక్కెట్లు కేటాయిస్తున్నారు? కరెంట్‌ బుకింగ్‌ ద్వారా ఎన్ని టిక్కెట్లను కేటాయిస్తున్నారు? అనే సమాచారం అందుబాటులో ఉండటం లేదు. ఇక దీనికి తోడు రద్దీ వేళలైన ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో తక్కువ టికెట్లు ఉంచి, రద్దీ లేని సమయాల్లో ఎక్కువ టికెట్లు అందుబాటులో ఉంచడం గమనార్హం. మరోవైపు కరెంట్‌ బుకింగ్‌ టికెట్‌ కౌంటర్లలో కూడా సరైన సేవలు అందడం లేదు. డొనేషన్‌ కౌంటర్‌ వద్ద సాధారణ భక్తుల కోసం రెండు, గంగాసదన్‌ వద్ద వీఐపీల కోసం కరెంటు బుకింగ్‌ కౌంటర్లను నిర్వహిస్తున్నారు. సాధారణ భక్తుల కోసం నిర్వహించే కౌంటర్లలో ఒక దానిని బ్రేక్‌ దర్శనం కోసం వినియోగిస్తున్నారు. ప్రస్తుతం సాధారణ భక్తుల కోసం ఒక కౌంటర్‌ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు లెక్క. దీంతో వేల సంఖ్యలో శ్రీశైలానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి సంబంధించిన టిక్కెట్‌ కౌంటర్లను మరిన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

సేవల సమాచారం ఎక్కడ..?

దేవస్థానం వెబ్‌సైట్‌ను తెలుగు, కన్నడ, తమిళం, మరాఠి, హిందీ, ఇంగ్లీషు భాషల్లో తీర్చిదిద్దాలని భావించారు. అయితే అధికారుల తీరువల్ల వెబ్‌సైట్‌ ప్రస్తుతం ఇంగ్లీషు భాషలో మాత్రమే సేవలు అందిస్తోంది. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉండటం ఏమిటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి ఆదేశించినా..

ఇటీవల దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శ్రీశైల దేవస్థానానికి విచ్చేశారు. ఈ సందర్భంగా భక్తుల నుంచి అదనంగా వసూలు చేస్తున్న చార్జీల గురించి ఆయన దృష్టికి పలువురు తీసుకువచ్చారు. దీనిపై మంత్రి ఆరా తీసి… ఈ బాదుడు వద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశించి దాదాపు 20 రోజులు కావస్తున్నా అదనపు చార్జీల విషయంలో దేవస్థానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

కొత్త సైట్‌ తీసుకువచ్చినా..

భక్తులకు మెరుగైన సేవలు అందించడం కోసం అప్పటికి ఉన్న వెబ్‌సైట్‌ను తొలగించి వేరే నిర్వాహకులతో కొత్త వెబ్‌సైట్‌ను తీసుకురావాలని దేవస్థానం యోచించింది. ఈ క్రమంలో కొత్త సైట్‌ బాధ్యతలను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. అయితే కొత్త వెబ్‌సైట్‌ నిర్వహణ అధ్వానంగా ఉండటమే కాక… సేవలకు సంబంధించిన సమాచారాన్ని అరకొరగా అందిస్తోంది. దీనిపైన భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.

శ్రీశైల దేవస్థానం వెబ్‌సైట్‌ ద్వారా అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా లేవని ఆలయ కార్యనిర్వహణాకారి ఎస్‌. లవన్నను వివరణ కోరగా.. దేవస్థానం ఆడిట్‌ విభాగం నవీకరణలను పరిశీలిస్తుందని, త్వరలోనే భక్తులకు పూర్తిస్థాయి సేవలు శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చునని తెలిపారు. నవీకరణ తర్వాత ప్రస్తుతం సేవలపై చెల్లిస్తున్న అదనపు భారం భక్తులపై పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.