News

బీజేపీకి దేశమే సర్వస్వం : మోదీ

199views

దేశంలో అవినీతిపైనా, వంశపారంపర్య రాజకీయాలపైనా పోరాడేందుకు భారతీయ జనతా పార్టీ (BJP) కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. బీజేపీకి అన్నిటి కన్నా దేశమే ముఖ్యమని చెప్పారు. ఆ పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ ఎంపీలను ఉద్దేశించి గురువారం ఆయన మాట్లాడారు.

అవినీతి, ఆశ్రిత పక్షపాతం, శాంతిభద్రతల సవాళ్ల నుంచి దేశాన్ని విముక్తి చేయడం కోసం బీజేపీ నిబద్ధతతో కృషి చేస్తోందన్నారు. బీజేపీకి సర్వస్వం దేశమేనని చెప్పారు. అవినీతిపైనా, వంశపారంపర్య రాజకీయాలపైనా పోరాడేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. రామభక్త హనుమంతుని మాదిరిగా భారత దేశం నేడు తన శక్తి, సామర్థ్యాలను తెలుసుకుంటోందన్నారు. అవినీతి, శాంతిభద్రతల సమస్యలపై పోరాడేందుకు బీజేపీ ఆంజనేయుడి నుంచి స్ఫూర్తిని, ప్రేరణను పొందుతోందన్నారు. భక్తాంజనేయుడి జీవితాన్ని పరిశీలించినపుడు, ‘నేను చేయగలను’ అనే వైఖరితో ఆయన వ్యవహరించారని తెలుస్తుందన్నారు. అన్ని రకాలుగా ఆయన విజయం సాధించడానికి కారణం ఇదేనని తెలిపారు. హనుమంతుడు ఏ పనినైనా చేయగలడని, ఆయన ఏ పనినైనా అందరి కోసం చేస్తాడని, తన కోసం తాను మాత్రం ఏదీ చేసుకోడని అన్నారు. హనుమంతుడు పాటించిన విలువలు, ఆయన బోధనల నుంచి బీజేపీ, దాని కార్యకర్తలు నిరంతరం ప్రేరణ పొందుతారని చెప్పారు. సముద్రమంతటి సవాళ్ళనైనా ఎదుర్కొనేంత బలంగా భారత దేశం ఎదిగిందని చెప్పారు. హనుమాన్ జయంతి సందర్భంగా అందరినీ దీవించాలని ఆయనను ప్రార్థిస్తున్నానని తెలిపారు.

రాచరికపు ఆలోచనా ధోరణిగలవారు పేదలను, వెనుకబడిన వర్గాలవారిని, హక్కులను పొందలేనివారిని 2014 నుంచి అవమానిస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలు కుటుంబ, కులతత్వవాదులని దుయ్యబట్టారు. భారత దేశం సాధిస్తున్న అభివృద్ధిని తక్కువ చేసి చూపుతున్నారని తెలిపారు. పేదలకు చేస్తున్న సేవలను ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు.

అధికరణ 370 గత చరిత్ర అవుతుందని ప్రతిపక్షాలు ఎన్నడూ ఊహించలేదన్నారు. బీజేపీ చేస్తున్న కృషిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. ప్రతిపక్షాలు చాలా నిరాశతో ఉన్నాయని, ‘మోదీ! నీ సమాధి తవ్వబడుతుంది’ అనే స్థాయిలో ఆ నైరాశ్యం ఉందని చెప్పారు. సామాజిక న్యాయం అనే నినాదాన్ని ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేవని, బీజేపీ మాత్రం సాంఘిక, సామాజిక న్యాయం కోసం, అన్ని వర్గాలవారి ఉపాధి అవకాశాల కోసం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ సరుకులను అందజేస్తున్నామని, ఎటువంటి వివక్ష లేకుండా ఈ పథకం అమలవుతోందని చెప్పారు. కాంగ్రెస్‌ అంటే వంశపారంపర్యత, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, అవినీతి అని చెప్పారు. బీజేపీ రాజకీయ సంస్కృతి అందరినీ కలుపుకొనిపోవడమని తెలిపారు. బీజేపీ భారత దేశం కోసం పగలు, రాత్రి అనే తేడా లేకుండా పని చేస్తోందన్నారు. భారత మాతకు, రాజ్యాంగానికి, దేశానికి బీజేపీ అంకితమైందన్నారు.

‘‘దేశానికే పెద్ద పీట అనే మంత్రాన్ని మా ధర్మసూత్రంగా పెట్టుకున్నాం. ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి నమ్మకం, అందరి కృషి’ అనే మంత్రంతో బీజేపీ పని చేస్తోంది’’ అని మోదీ చెప్పారు.