
ప్రకాశం జిల్లాలో శ్రీరామనవమిని పురస్కరించుకొని మార్కాపురం పట్టణం శ్రీరామ నామస్మరణలతో పులకించిపోయింది. పట్టణంలోని ప్రసన్న రామాలయం, పట్టాభి రామాలయం, రజకవీధి, కోనేరు వీధులతో పాటు పలు వీధులలో రామాలయాల వద్ద కల్యాణం నిర్వహించారు. ప్రసన్న రామస్వామి ఆలయంలో అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు, ఏవీకే నరసింహాచార్యులు, నంద్యాల రంగాచార్యుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ ఘట్టాలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున హాజరై కళ్యాణాన్ని తిలకించారు. పానకం, వడపప్పు భక్తులకు పంచారు.
శ్రీరామనవమి వేడుకలు గ్రామాల్లో, పట్టణాల్లో వైభవంగా జరిగాయి. ప్రజలు తమ ఇళ్లలో పూజలు ముగించుకుని రామాలయాలకు వెళ్లి సీతారాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని పాత బద్వేలు రోడ్డులోని రామాలయంలో, న్యూ బద్వేలు రోడ్డులోని పట్టాభి రామస్వామి దేవాల యంలో, శ్రీవాసవి కన్యకాపరమే శ్వరి దేవాలయంలో, షిర్డిసాయిబాబా దేవాలయంలో సీతారాముల కల్యాణం పట్టాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. పలువురు దంపతులు పీటలపై కూర్చొని క్రతువు నిర్వహించారు. సంజీవ రాయునిపేట గ్రామంలో కల్యాణానికి వచ్చిన భక్తులకు వాసవిక్లబ్ ప్రతినిధులు పానకం, వడపప్పు ప్రసాదాలు పంచిపెట్టారు. పట్టణంలోని పంచముఖ ఆంజనేయ స్వామి, కొత్తపల్లి, కొండపేట, కే.ఎస్.పల్లి, ముండ్లపాడు, పొదలకొండపల్లి తదితర గ్రామాల్లోని రామాలయాలు, ఆంజనేయస్వామి దేవాలయాల్లో శ్రీరామనవమి వేడుకలను నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు పొదలకొండపల్లిలో ఎడ్లబల ప్రదర్శన పోటీలు నిర్వహించారు.
కంభం, అర్థవీడు మండలాల్లో పలు గ్రామాల్లో శ్రీరామనవమి సందర్భంగా రామాల యాలు భక్తులతో కిటకిటలాడాయి. లింగోజీపల్లిలో గురువారం ఉదయం అంకురార్పణ, సహస్త్రనామ పూజ అనంతరం సీతారాముల కల్యాణం వేదపండి తుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. పట్టణంలోని శ్రీపట్టాభిరామస్వామి దేవాలయం, కందులా పురంలోని రాములవారి దేవాలయాలలో భక్తులు తరలివచ్చారు. వడపప్పు, పానకాలు పంపిణీ చేశారు. అన్నదానం నిర్వహించారు.





