
పాక్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ పాతాళానికి పడిపోతున్న వేళ ఆ దేశ ప్రధాని బుధవారం అసాధారణమైన, అత్యంత కఠినమైన నిర్ణయాలను ప్రకటించారు. కేంద్ర మంత్రులెవరూ జీతాలు తీసుకోవద్దని, ఎవరి బిల్లులను వారే చెల్లించాలని ఆదేశించారు. విదేశీ పర్యటనల సమయంలో ఖర్చులను తగ్గించాలని, 5స్టార్ హోటళ్లలో అసలే బస చేయవద్దని కోరారు. అలాగే, విదేశీ పర్యటనలకు వెళ్లే మంత్రులు ఎకానమీ క్లాసులోనే వెళ్లాలని సూచించారు. బుధవారం పలువురు కేంద్రమంత్రులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రమంత్రుల దగ్గర ఉన్న లగ్జరీ కార్లను ప్రభుత్వానికి అప్పగించాలని, వాటిని వేలం వేస్తామని తెలిపారు. మంత్రులకు అవసరం అనుకుంటే భద్రత కోసం ఒక కారును కేటాయిస్తామని చెప్పారు. సమావేశాల సమయంలో మంత్రులకు అందించే ఆహారపు ఖర్చులను కూడా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తన సలహాదారులు కూడా తమ జీతాలను వదులుకున్నట్లు షరీఫ్ ఈ సందర్భంగా తెలిపారు.
ప్రభుత్వ ఖర్చు 15% తగ్గాలి
విదేశాల్లో రాయబార కార్యాలయాల నిర్వహణ, సిబ్బంది వేతనాల ఖర్చును తగ్గించాలని షరీఫ్ పాక్ విదేశాంగ శాఖను ఆదేశించారు. మొత్తంగా ప్రభుత్వ విభాగాల్లో ఖర్చులను కనీసం 15ు తగ్గించాలని అధికార యంత్రాంగానికి సూచించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కూడా కోత విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐఎ్‌సఐకి కూడా నిధులను తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం. షరీఫ్ తాజా నిర్ణయాలతో పాక్ ఖజానాకు ఏటా రూ.200 కోట్లు(పాక్ కరెన్సీ) ఆదా అవుతాయని అంచనా. కాగా, ఖర్చులను తగ్గించడంతో పాటు ఆదాయ పెంపుపైన కూడా షరీఫ్ దృష్టి సారించనట్లు తెలుస్తోంది. పన్నులు పెంచడం, పెన్షన్ చెల్లింపుల్లో సంస్కరణలతో ఆదాయాన్ని పెంచుకోవాలని షరీఫ్ భావిస్తున్నట్లు తెలిసింది.





