
శ్రీకాళహస్తీశ్వరుని నందిసేవను భక్తులు నయోనత్సవంగా తిలకించి తరించారు. పురవీధుల ఊరేగింపును తిలకించేందుకు… ఆ జంగమయ్య జాగరణ చేసి మొక్కులు తీర్చుకునే భక్తులతో శ్రీకాళహస్తీశ్వరాలయం, మాడ వీధులు కిక్కిరిసిపోయాయు. జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు సింహ వాహనాన్ని అధిరోహించి అనుసరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, కళాకారుల కోలాటాలు, నృత్యాలు, వేషధారణల మధ్య సాగిన ఊరేగింపు మహోత్సవం ఆద్యంతం వైభవాన్ని చాటింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పూలు, పండ్లతో చేసిన అలంకరణలు భక్తులను అబ్బురపరిచాయి. స్వామివారి సన్నిధి, అమ్మవారి సన్నిధి, గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఈ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామివారి ధ్వజస్తంభం, గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద పుష్పాలకంరణ కనువిందు చేసింది. కంచుగడప నుంచి దక్షిణ గోపురం వరకు బంతిపూల అలంకరణ చేశారు. ఆలయం వెలుపల 16కాళ్ల మండపంలో పూలతో శివలింగం, నందీశ్వరుని ప్రతిమలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సుగంధ ద్రవ్యాలతో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను యాలకులు, లవంగాలు, బాదం వంటి వివిధ సుగుంధ ద్రవ్యాలతో శోభాయమానంగా అలంకరించారు. దక్షిణ గాలిగోపురం ప్రవేశద్వారం వద్ద భారీ శివలింగ ప్రతిమను ఏర్పాటు చేశారు. శివలింగం కింద నుంచి భక్తులు మోక్షమార్గంలో స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా నెలకొల్పారు. ఇది భక్తులను ఆకట్టుకుంది.





