
శ్రీకాళహస్తీశ్వరాలయంలో శివరాత్రిని పురస్కరించుకుని నిజమూర్తి రూపంలో వాయు లింగేశ్వరుడు దర్శనమిచ్చారు. పండుగవేళ స్వామి, అమ్మవార్లకుఉదయం ప్రథమ, ద్వితీయ కాలాభిషేకాలతో పాటు ఉచ్చికాలాభిషేకం, సాయంత్రం ప్రదోష కాలాభిషేకం నిర్వహించారు. మొత్తం శనివారం ప్రత్యేకంగా నవ అభిషేకాలు జరిగాయి. శనివారం వేకువజామున 2గంటలకే మంగళవాయిద్యాలు, మేళతాళాల మధ్య స్వామి, అమ్మవార్లను పళ్లియరలో మేల్కొపారు. అనంతరం గో పూజ నిర్వహించారు. స్వామి అమ్మవార్లను మొదట గోమాత దర్శించుకుంది. మూడు గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఉదయం 5 గంటల నుంచి 10.30 గంటల మధ్య స్వామి అమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. వేకువజామున 2 గంటల నుంచే భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. రాజగోపురం సమీపం నుంచి సామాన్య భక్తుల కోసం ఉచితదర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేసి మహా లఘుదర్శనం కల్పించారు. ప్రత్యేక దర్శన టిక్కెట్టు కొనుగోలు చేసిన వారి కోసం దక్షిణ గోపురం వైపు నుంచి భక్తులను అనుమతించారు.





