
విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వి ప్రాచి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ అమ్మాయిలు తమ పర్సులో దువ్వెన, లిప్‌స్టిక్‌కు బదులుగా కత్తి ఉంచుకోవాలని ఆమె సూచించారు. ఇందువల్ల జీహాదీలు వారి వద్దకు రాలేరని అమ్మాయిలకు హితవు పలికారు. జీహాదీల ఆట కట్టించేందుకు ఇదే మార్గమని బుధవారంనాడు మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ముస్లింలు తమ మతం కోసం ఏవిధమైన కట్టుబాట్లు అనుసరిస్తున్నారో అదే విధంగా హిందువులు కూడా సంప్రదాయబద్ధంగా ఉండాలని అన్నారు. ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ దారుణ హత్య కేసును ఆమె ప్రస్తావిస్తూ… జీహాదీలు మీ తలను పట్టికెళ్లేందుకు సిద్ధపడితే, దానికి ముందే మీరు (హిందూ అమ్మాయిలు) వారి కుత్తుకలు (గొంతులు) కత్తిరించాలని అన్నారు. సాధ్వి ప్రాచీ స్థానిక అనాది కల్పేశ్వరర్ ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా జమాతే ఉలేమా-ఇ-హింద్ చీఫ్ మౌలానా అర్షగ్ మదాని ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆమె మాట్లాడుతూ.. మదానీకి హిందూయిజం గురించి ఏబీసీడీలు కూడా తెలియవని, భారతదేశం హిందూ దేశమని, భవిష్యత్తులో కూడా హిందూ దేశంగానే ఉంటుందని చెప్పారు. మదానీ వ్యాఖ్యలకు నిరసనగా జైన్ ఆచార్య లోకేష్ ముని, ఇతర సాధువులు జమాతేను బాయ్‌కాట్ చేయడం సరైన చర్యేనని అన్నారు. ఈ దేశానికి అలాంటి సాధువులు అవసరమని తెలిపారు. 1947లో దేశ విభజనకు మదానీ లాంటి వ్యక్తులే కారణమని, మదానీ పూర్వీకులు 100-200 ఏళ్ల క్రితం మతం మారారని, మదానీ తిరిగి హిందూమతంలోకి రావడానికి ఇదే సరైన తరుణమని హితవు పలికారు.





