
భక్తి గీతాలను ఆలపించే గాయకుడు అనూప్ జలోటా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువుల జనాభా అధికంగా ఉన్నందువల్ల భారత దేశాన్ని హిందూ దేశంగా పరిగణించాలని అన్నారు. దీనివల్ల ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదన్నారు. ఆయన వ్యాఖ్యలతో కూడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
భారత దేశంలో హిందువుల జనాభా ఎక్కువగా ఉన్నందువల్ల దీనిని హిందూ దేశంగా పరిగణించాలని అనూప్ జలోటా అన్నారు. దీనివల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. జమ్మూ-కశ్మీరు విషయంలో చేసినట్లుగానే కేవలం ఓ ప్రకటన చేస్తే సరిపోతుందన్నారు. జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయని, శాంతి ఏర్పడిందని అన్నారు.
ప్రపంచంలో హిందువులకు ఓ దేశం లేదన్నారు. నేపాల్ గతంలో హిందూ దేశంగా ఉండేదని… కానీ దానిని ఇక హిందూ దేశం అని పిలవడం సాధ్యం కాదని అన్నారు. భారత దేశంలో హిందువులు అధికంగా ఉన్నారని, ఈ డిమాండ్‌ను వినిపించేవారి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోయినప్పుడు, అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉండటంతో ఆ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించారని తెలిపారు. భారతదేశాన్ని కూడా హిందూ దేశంగా అప్పట్లోనే ప్రకటించి ఉండవలసిందన్నారు. అప్పుడు అలా జరగలేదు కాబట్టి ఇప్పుడు జరగాలన్నారు.





