
(ఆగస్టు 15 – ‘దేశభక్త’ కొండా వెంకటప్పయ్య వర్ధంతి)
దేశానికి స్వతంత్రం వచ్చి నాలుగు నెలలు కూడా నిండకుండానే కాంగ్రెస్ నాయకుల అవినీతి అరాచకాలు మిన్నంటాయి. ఆ విషయాన్ని ఒక కాంగ్రెస్ నాయకుడే గాంధీకి బహిరంగలేఖ ద్వారా తెలియపరిచారు. ఆయనే కొండా వెంకటప్పయ్య. స్వతంత్రం కోసం పోరాడినట్లు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ అవినీతికి చిరునామాగా మారిన తీరును నేరుగా గాంధీకే వెల్లడించడం ఆయన ముక్కుసూటితనానికి నిదర్శనం.
కొండా వెంకటప్పయ్య 1866 ఫిబ్రవరి 22న పాత గుంటూరులో బుచ్చమ్మ, కోటయ్య దంపతులకు జన్మించారు. గుంటూరులో ప్రాథమిక విద్య, మద్రాసులో బీయే బీఎల్ అభ్యసించారు. ఆ సమయంలోనే మద్రాసులో కాంగ్రెస్ మహాసభలకు హాజరై, ఆ సంస్థ అభిమానిగా మారారు. విద్యాభ్యాసం పూర్తయాక బందరులో న్యాయవాద వృత్తి చేపట్టారు. అప్పుడే ఆయన, స్వతంత్ర సాధన దిశగా జాతిని జాగృతం చేసే లక్ష్యంతో 1902లో ‘కృష్ణా పత్రిక’ ప్రారంభించి, 1905వరకూ తానే స్వయంగా నడిపారు.
ఆంధ్రరాష్ట్రం కోసం పోరాటం ప్రారంభించినది వెంకటప్పయ్యే. 1912 మే నెలలో నిడదవోలులో జరిగిన రాజకీయ మహాసభలో ఆయన సలహాతోనే 11 తెలుగు జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు గురించి చర్చలు జరిగాయి. ఆయన సలహా మేరకే మొదటి ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం గురించి దేశవ్యాప్త ప్రచారం కోసం ఏర్పడిన కమిటీలోనూ ఆయనదే ప్రధాన పాత్ర. నెల్లూరు ఆంధ్రమహాసభ సమావేశానికి అధ్యక్షుడిగా ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి నిర్దిష్ట కార్యక్రమం రూపొందించారు. 1917లో మాంటేగ్-ఛెమ్స్ఫర్డ్ కమిటీ ముందు నిలిచి భాషాప్రయుక్త రాష్ట్రాల అవసరాన్ని వివరించారు. 1918లో ఏర్పడిన ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీకి మొదటి కార్యదర్శి ఆయనే.
కాంగ్రెస్ పార్టీ సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించినప్పుడు వెంకటప్పయ్య మద్రాస్ కౌన్సిల్‌లో తన సభ్యత్వానికి రాజీనామా చేసారు. కొన్నాళ్ళకే ఆయన ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడూ, జాతీయ కాంగ్రెస్ సభ్యుడూ అయ్యారు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలను బెజవాడలో విజయవంతంగా జరిపారు. మహాత్ముని ఆంధ్ర పర్యటన సమయంలో స్వరాజ్యనిధికి వేల రూపాయల విరాళాలు సేకరించారు. 1923 కాకినాడ కాంగ్రెస్ మహాసభల సమయంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గాంధీ 1933లో ఆంధ్రలో హరిజన యాత్ర చేపట్టినప్పుడు వెంకటప్పయ్య కృషితోనే 65 వేల రూపాయలు హరిజన నిధి వసూలైంది. భార్య మరణశయ్యపై ఉన్నా, వెంకటప్పయ్య హరిజన సేవలో నిమగ్నమవడాన్ని గాంధీ ప్రశంసించారు.
వెంకటప్పయ్య పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం సమయంలో మొదటిసారి జైలుకు వెళ్ళారు. తర్వాత 1929లో సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమంలో, 1930లో ఉప్పు సత్యాగ్రహంలో, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు జైలుశిక్షలు అనుభవించారు. 1937 ఎన్నికల్లో ఆయన మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. మద్రాసు రాష్ట్రాన్ని భాషా ప్రాతిపదికన ఆంధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలుగా విభిజించాలంటూ కొండా వెంకటప్పయ్య శాసన సభలో ప్రవేశ పెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా నెగ్గింది. ఆంధ్రరాష్ట్ర ఉద్యమాన్ని 1920లో ప్రారంభించి 1949లో మరణించేవరకూ నడిపిన మహానాయకుడు వెంకటప్పయ్య.
దేశభక్త బిరుదాంకితుడైన కొండా వెంకటప్పయ్య ప్రతిభకు, త్యాగానికి కాంగ్రెస్ రాజకీయాల్లో తగిన స్థానం దక్కలేదు. ఆయన ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదు. వెంకటప్పయ్య ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సభకు అధ్యక్షుడిగా పనిచేశారు. అఖిల భారత చరఖా సంఘానికి జీవితకాల సభ్యుడిగా ఉన్నారు. గ్రంథాలయోద్యమంలోనూ పాల్గొన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన రెండేళ్ళకు, 1949లో ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం నాడే ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగువారే కాదు, భారతీయులందరూ స్మరించుకోవాల్సిన నిరాడంబర సేవామూర్తికి ఘన నివాళి.





