News

అంగరంగ వైభవంగా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

42views

ఇల కైలాసంగా పిలిచే శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక అలంకృతులైన స్వామి, అమ్మవార్లను సుగంధ పుష్పాలతో ముస్తాబైన హంస వాహనంపై అధిష్టింపజేశారు. అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ ఆలయం నుంచి వెలుపలికి తోడ్కొని వచ్చారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజాదికాలను నిర్వహించి క్షేత్ర వీధుల్లో గ్రామోత్సవం జరిపారు. గ్రామోత్సవం ముందు కోలాటం, చెక్కభజన, రాజభటుల వేషాలు, జాంజ్‌ పథక్‌, జానపద పగటి వేషాలు, గొరవయ్యలు, బుట్టబొమ్మల నృత్యాలు, బీరప్పడోలు, తప్పెట్లు, డ్రమ్స్‌, భజంత్రీలు, బంజారా నృత్యం, చెంచు నృత్యం, శంఖనాదాలు మార్మోగాయి. ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం గంగాధర మండపం మీదుగా నంది మండపం వరకు సాగింది. తిరిగి అక్కడి నుంచి బయలు వీరభద్ర స్వామి ఆలయం దాకా కొనసాగింది. హంస వాహనంపై విహరించిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను భక్తులు కనులారా వీక్షించారు. రాత్రి 7 గంటలకు విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కె.రాంబాబు, కార్యనిర్వహణ అధికారి డి.భ్రమరాంబ, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. గ్రామోత్సవంలో దేవస్థానం అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేదపండితులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నాలుగో రోజు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి మయూర వాహనసేవ, గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, సాయంకాలం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టువస్ర్తాలను సమర్పించనున్నారు.

భక్తులతో ఆలయం కిటకిట…
శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. రోజురోజుకూ ఈ సంఖ్య పెరుగుతోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు క్యూ కడుతున్నారు. జనవాహినితో శ్రీశైల క్షేత్ర వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. క్షేత్రంలోని అన్నదాన సత్రాలు, వసతి కేంద్రాలు భక్తుల సేవలో తరిస్తున్నాయి. భక్తులకు దర్శనం కోసం ఉచిత క్యూలైన్‌, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనంతో పాటు జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేశారు. ఈ క్యూలైన్‌లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని స్వామి వారి సర్వదర్శనానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

భక్తిశ్రద్ధలతో ఇరుముడుల సమర్పణ
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మండల, అర్ధ మండల దీక్షను స్వీకరించిన శివ స్వాములు శ్రీశైలం మల్లన్నకు భక్తితో ఇరుముడులు సమర్పిస్తున్నారు. దేవస్థానం వారు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన క్యూ లైన్ల ద్వారా శివస్వాములు ఇరుముడులతో స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అనంతరం ప్రత్యేక శిబిరాలలో శాస్త్రోక్తంగా శివ దీక్షలు విరమిస్తున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు..
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా భరతనాట్యం, కూచిపూడి, హరికథ, జానపదగీతాలు, భక్తిరంజని, వీరబ్రహ్మేంద్రస్వామివారి నాటకం, బాలనాగమ్మ, సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శనలను నిర్వహిస్తోంది. ఆలయ దక్షిణ మాఢవీధిలోని నిత్యాకళారాధన వేదిక, పుష్కరిణి ప్రాంగణంలోని భ్రామరీ కళావేదిక, శివదీక్షా శిబిరాల ప్రాంగణంలో ఈ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.

పాదయాత్ర భక్తులకు ప్రత్యేకం…
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పాదయాత్రగా వచ్చే భక్తులకు ఉచితంగా శీఘ్ర దర్శనం కల్పించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా నడక మార్గంలోని పెచ్చెర్వు వద్ద ప్రత్యేక కంకణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పాదయాత్రగా శ్రీశైలానికి వచ్చే భక్తులు ఈ కంకణాలను కట్టుకోవాలి. వీరికి దేవస్థానం అధికారులు శీఘ్ర దర్శనం కల్పిస్తున్నారు.