News

త్రిపురాంతక క్షేత్రాన్ని ఓ సారి చూతుము రారండి.. !

78views

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రాచీన హైందవ క్షేత్రాలలో ఒకటి చెప్పుకునే ఆలయం త్రిపురాంతక పుణ్యక్షేత్రం. ఇక్కడ త్రిపురాంబా సమేతుడైన త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపురసుందరీ అమ్మవారు ఇద్దరు స్వయం వ్యక్తముగా వెలిశారు. కుమారగిరిపై ఈ త్రిపురాంతకేశ్వరుడి ఆలయం భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతుంది. త్రిగుణాలను భస్మం చేసిన రూపమే త్రిపురాంతకేశ్వర స్వరూపము. శివుడు ఏకాదశ రుద్ర స్వరూపుడు. భారతదేశంలోని ఏకాదశ శివక్షేత్రాలలో త్రిపురాంతకక్షేత్రం అత్యంత ప్రాముఖ్యత కలది. త్రిపురాంతకం శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రసిద్ది గాంచినది. ఈ క్షేత్రానికి కుమారగిరి అని కూడా పిలుస్తుంటారు.

ఈ క్షేత్రంలోని త్రిపురగిరిపై ఆవిర్భవించిన త్రిపురాంబదేవి సహిత త్రిపురాంతకేశ్వర స్వామి. సాక్షాత్తు వ్యాస భగవానులు స్కాంధ పురాణంలో త్రిపురాంతక క్షేత్ర మహత్యాన్ని, ఔన్నత్యాన్ని చెప్పారు. స్కంధ పురాణం, బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, శివతత్వ సారము, రసరత్నాకరం, నాగార్జున తంత్రం వంటి అనేక ప్రామాణిక గ్రంథాలలో త్రిపురాంతక క్షేత్ర ప్రాసశ్త్యం, ఔన్నత్యాన్ని కొనియాడారు. యజుర్వేదంలోని రుద్రాద్యాయంలో త్రిపురాంతకుని నామ ప్రస్తావనను బట్టి ఈ క్షేత్రం వేదకాలం నాటిదని పండితుల అభిప్రాయం. త్రిపురాసురులను సంహరించినందున ఈక్షేత్రం త్రిపురాంతకంగాను, శివుడు త్రిపురాంతకేశ్వరుడిగాను కీర్తించబడుతున్నాడు. శివుడు త్రిపురాంతకేశ్వరుడై కుమారగిరి అంతర్భాగమున రస లింగంగాను, స్వయం భూవై ఆవిర్భవించినట్లు ప్రతీతి. దేవతలు, ఋషులు, సిద్ధులు సూక్ష్మ రూపంలో వచ్చి స్వామిని అర్చిస్తారని ఇక్కడి భక్తుల విశ్వాసం ఈ రస లింగాన్ని కేంద్రంగా చేసుకొని ఉపరితలంలో శ్రీ చక్ర పీఠమును ఏర్పరిచి దానిపై ఆలయ నిర్మాణం చేశారు. పైభాగమున బ్రహ్మ జల లింగాన్ని ప్రతిష్టించారని ప్రతీతి. ఈ లింగానికి అభిషేకించిన జలం భూగర్భంలో ఉన్న త్రిపురాంతకేశ్వరునికి చేరుతుందని ఉపాసకులు చెబుతుంటారు. త్రిపురాంతకేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో అపరాజితేశ్వరలింగం, యజ్ఞేశ్వరలింగం, మారుతిలింగం, ఉగ్రేశలింగం, శివలింగాలు ఉన్నాయి. దేవాలయానికి నైరుతి భాగంలో చీకటి గృహ ఉంది. దీనిని అగస్త్య మహర్షి నిర్మించారని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ నుంచి శ్రీశైలానికి సొరంగ మార్గం ఉన్నట్లు పురాణాల్లో ఉంది. గృహ లోపలి భాగంలో భూగర్భంలో పాతాళేశ్వరుడుగా పిలువబడే శివలింగం ఉంది. త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయానికి దక్షిణ భాగాన చెరువులో బాలాత్రిపుర సుందరీదేవి ఆలయం ఉంది. ఇక్కడి అమ్మవారిని చిదగ్నిగుండ సంభూతగా, కదంబ వనవాసినిగా పిలుస్తారు. త్రిపురాసుర సంహారం సమయంలో శివుడు ఈ తల్లిని ప్రార్ధిస్తే శివ ధనస్సును ఆమె శక్తి ఆవహించి త్రిపురాసురుని సంహరించిందని, రుగ్వేదంలో పొందుపరచినట్లు పురాణాల్లో ఉంది. గుండంలో బాలాత్రిపురసుందరీదేవి అమ్మవారు నిర్గుణ శిలాకారంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ఆలయం ప్రకాశం జిల్లాలో ఉంది.

ఈ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఐదురోజులపాటు, విజయదశమి సందర్భంగా అమ్మవారికి తొమ్మిది రోజులపాటు నవరాత్రులు, ఉగాది సందర్భంగా నవరాతుల్రు, స్వామివారికి గ్రామోత్సవం, వైశాఖపౌర్ణమికి, శ్రావణపౌర్ణమికి అమ్మవారికి లక్షపుష్పార్చన, నవధాన్యార్చన, స్వామివారికి లక్షబిల్వార్చన నిర్వహిస్తారు. ప్రతి అమావాస్యకు చిన్నమస్తాదేవికి నిమ్మకాయలపూజలు, ప్రత్యేక సందర్భాలలో చండీహోమం, రుద్రహోమం, సహస్రచండీ, రుద్రచండీ పూజలు జరుగుతాయి. నిత్యం అమ్మవారికి అభిషేకం, ప్రాతఃకాలపూజలు, బాలబోగం, కుంకుమార్చనలు, అష్ఠోత్తరాలు, ఖడ్గమాల పూజలు నిర్వహిస్తారు. ఈ ఏడాది మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 16 నుంచి 22 వరకు ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈనెల 18న ఉదయం 3 గంటలకు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు, 12.30 గంటలకు కళ్యాణోత్సవం, 3 గంటలకు అలయ ఉత్సవం నిర్వహిస్తారు. 20న మధ్యాహ్నం 3 గంటలకు రధాంగహోమం, రధాంగబలి, రధోత్సవం, 21న బలిహరణ, పూర్ణాహుతి, మూకబలి, 22న రాత్రి 8 గంటలకు శయనోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి…

ఆలయ ప్రత్యేకతలు ఇవే… 

శ్రీచక్ర ఆధారిత నిర్మాణమైన ప్రపంచంలోని ఏకైక శివాలయం త్రిపురాంతకేశ్వరాలయం. ఈ క్షేత్రంలోనే ఆదిశంకరాచార్యులు లలితా సహస్త్రనామం రచించినట్లు కొన్ని పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రపంచంలో ఏ శివాలయంలో మంత్రాలు చదవాలన్నా ‘నమస్తే అస్తు భగవాన్‌, విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రిపురాంతకాయ, త్రికాయ, కాలాగ్నిరుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమత్‌ మహాదేవాయ’ అని త్రిపురాంతకేశ్వరస్వామి నామాన్ని పటిస్తుంటారు. ఈ క్షేత్రంలో కనిపించే కదంబ వృక్షాలు కాశి క్షేత్రంలో మాత్రమే కనిపిస్తాయి.