
భూత వైద్యం పేరుతో అమాయక యువతులను బుట్టలో వేసుకోవడం.. పెళ్లి పేరుతో మోసం చేయడం.. రాజకీయ ప్రముఖుల అండదండలతో ఏ ఇబ్బందీ రాకుండా చూసుకోవడం.. ఇదీ ఓ ముస్లిం బాబా అవతారం ఎత్తిన ఓ వ్యక్తి చేసిన అరాచకం. ఇప్పటివరకు ఏడు వివాహాలు చేసుకున్న అతడు.. ఎనిమిదో పెళ్లికి సిద్ధమై, అనారోగ్యం కారణంగా చూపుతూ తప్పించుకున్నాడు. దీనిపై యువతి బంధువులు పోలీసులను ఆశ్రయించడం.. వారు రంగంలోకి దిగడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చా యి. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలంలోని ప్రముఖ దర్గా రహ్మతాబాద్‌కు చెందిన బాబాగా చెప్పుకొంటున్న హఫీజ్‌పాషా ఆగడాలు మొత్తం బయటపడ్డాయి. భూత వైద్యుడిగా ప్రచారం చేసుకునే అతడు అనారోగ్య సమస్యలతో తన వద్దకు వచ్చే యువతులకు.. దెయ్యం పట్టిందని బెదిరించి లొంగదీసుకునేవాడు. చికిత్స కోసం వెళ్లిన హైదరాబాద్ టోలీచౌకీకి చెందిన ఓ యువతిని కూడా ఇలాగే వలలో వేసుకున్నాడు.
తనతో పెళ్లి చేస్తే ప్రాణాలు కాపాడతా అని చెబుతూ..
‘‘మీ బిడ్డకు దెయ్యం పట్టింది. ఆమె ఆరోగ్యం అంతంతే’’ అంటూ హైదరాబాద్ యువతి కుటుంబ సభ్యులను తొలుత హఫీజ్‌పాషా బెదిరించాడు. మూడేళ్ల పాటు అక్కడే చికిత్స తీసుకున్న యువతికి బాబాతో స్నేహం పెరిగింది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు హఫీజ్ పాషా నాటకం ఆడాడు. ‘మీ అమ్మాయి ఆరోగ్యం కుదుటపడలేదు. కొన్ని రోజుల్లో చనిపోతుంది. నాకిచ్చి పెళ్లి చేస్తే ఆమె ప్రాణాలు కాపాడతా’’నని ఆమె కుటుంబ సభ్యులను నమ్మించాడు. దీంతో వారు ఈ నెల 11న టోలీచౌకీలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. 200 మంది అతిథులు హాజరైనా.. హఫీజ్‌పాషా మాత్రం మండపానికి రాలేదు. యువతి బంధువులు సంప్రదించగా.. అనారోగ్యంతో ఉన్నానని, పెళ్లి చేసుకోలేనని చెప్పాడు. దీంతో వారు లంగర్‌హౌజ్ పోలీసులను ఆశ్రయించగా.. హఫీజ్‌ను ఆదివారం అరెస్టు చేశారు. తమ కూతురు ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ.. హఫీజ్ పాషా మాయమాటలు చెప్పాడని బాధిత యువతి తండ్రి ఆరోపించారు. హఫీజ్ పాషాకు ఏడు పెళ్లిళ్లు జరిగాయన్న విషయమై విచారణ చేస్తున్నామని లంగర్‌హౌజ్ పోలీసులు చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో బడా నేతల అండదండలతోనే..
హఫీజ్ పాషాకు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, తెలంగాణ హోం మంత్రి మహమూద్‌అలీతో పాటు పాతబస్తీ ఎమ్మెల్యేలు, కొందరు ప్రముఖులతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. కరోనా సమయంలో అనుమతులు లేనప్పటికీ దర్గాలో ప్రార్థనలు చేయించిన సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి.





