

విలువలతో కూడిన విద్యను అందించేందుకు శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఎల్లప్పుడూ ముందుంటుందని పలువురు వక్తుల ప్రశంసించారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ఱోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సేవలు అందిస్తున్న అధ్యాపకులు, ఇతర సిబ్బందిని సత్కరించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శారదాధామంలోని శిక్షణ కేంద్రం ఆవరణలో మూడు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యా భారతి అఖిల భారత అధ్యక్షులు దూసి రామకృష్ణారావు, సంఘటన కార్యదర్శి గోవింద్ మొహంతో, దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు, కార్యదర్శి అయాచితుల లక్ష్మణరావు, సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి విచ్చేసి మార్గదర్శనం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 400కు పైగా పాఠశాలలను శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో నడుస్తున్నాయన్నారు. విలువలకు ప్రాధాన్యం ఇస్తూ విద్యాబోధన సాగుతుందని వారు స్పష్టం చేశారు.
అనంతరం నిర్వహించిన ప్రధాన అధ్యాపకుల శిబిరంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం ప్రగతిని గురించి చర్చించారు. శిశు మందిర్ పాఠశాలల నిర్వహణలో కీలకపాత్ర వహిస్తున్న ఆచార్యులతో భవిష్యత్తు ప్రణాళికల మీద చర్చ జరిపారు. ఈ సందర్భంగా ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ తిరుపతి రావు, కార్యదర్శి ముక్కాల సీతారాములు, క్షేత్ర శైక్షణిక్ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ మార్గనిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం అభ్యున్నతికి కృషిచేసిన సంఘటన కార్యదర్శులను సన్మానించారు. జేఎమ్ కాశీపతి, లింగం సుధాకర్ రెడ్డి, వీఆర్ జగదీష్, పతకమూరి శ్రీనివాస్, కన్నా భాస్కర్, పసర్తి మల్లయ్య తదితరులను సత్కరించారు. క్రమశిక్షణ, సేవాభావం వంటివి పెంపొందిస్తూ.. తెలుగు రాష్ట్రల్లో నాణ్యమైన విద్యను, సామాజిక నైపుణ్యాలను అన్ని వర్గాల విద్యార్థులకు శ్రీ సరస్వతీ విద్యాపీఠం అందిస్తోందని వారు తెలిపారు. దీనికోసం జీవిత పర్యంతం సేవలు అందిస్తున్న ప్రచారక్ లను సత్కరించారు. ఈ ప్రస్థానంలో ముఖ్య పాత్ర పోషించిన నాయకత్వ శ్రేణులకు, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ను అభినందించారు. మూడు రోజుల పాటు శిబిరం నిర్వహించడం ద్వారా ద్వారా సిబ్బందిలో మరింత నూతనుత్తేజం కలిగించారు.






