News

భారత్‌లో భూకంప భయాలు.. మూడు రాష్ట్రాల్లో ప్రకంపనలు!

226views

తుర్కియే, సిరియాలో భారీ భూకంపం అనంతరం భారత్‌లో కూడా భూకంపాలు సంభవించే ముప్పు ఉందని నిపుణలు అంచనా వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అవి నిజరూపం దాల్చుతున్నాయి. దేశంలో వరుస భూకంపాలు నమోదవుతున్నాయి. గుజరాత్‌లో శనివారం, అస్సాంలో ఆదివారం భూప్రకంపనలు రాగా.. తాజాగా సోమవారం ఉదయం సిక్కింలో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 4.3 తీవ్రత నమోదైంది. ఈశాన్య రాష్ట్రం సిక్కింలోని యుక్‌సోం ప్రాంతంలో 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు  జాతీయ భూ విజ్ఞాన కేంద్రం ట్విట్టర్‌లో తెలిపింది.  ఉదయం 4:15 గంటల సమయంలో భూకంపం వచ్చినట్లు పేర్కొంది.

అస్సాం, గుజరాత్‌లోనూ..
ఆదివారం అస్సాంలోనూ భూకంపం వచ్చింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 4.0గా నమోదైంది. అంతుకుముందు రోజు గుజరాత్‌ సూరత్‌లోనూ 3.8 తీవ్రతో భూమి కంపించింది. దేశంలో 60 శాతం భూభాగం భూకంపం ముప్పు జోన్‌లో ఉన్నాయని కేంద్ర ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ  2022 డిసెంబర్‌లో పార్లమెంటులో వెల్లడించింది. మన దేశంలో భూకంప ముప్పు వచ్చే ప్రాంతాలను నాలుగు జోన్లుగా విభజించారు. ఇందులో జోన్‌ అయిదులో ఉంటే అత్యంత ప్రమాదకరమని, రెండో జోన్‌లో ఉంటే ముప్పు అత్యంత స్వల్పంగా ఉంటుంది.