
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు కీలక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు మొత్తం 40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా ఆగస్టు 1 నుంచి 31 వరకు పుష్కరిణిలో మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా, సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు భారీ వర్షాలు, తుఫాన్ల అవకాశం ఉండటంతో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పుష్కరిణిని పూర్తిగా మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు పుష్కరిణి హారతి కూడా నిర్వహించబడదని స్పష్టం చేసింది. ఈ 40 రోజుల వ్యవధిలో భక్తులను పుష్కరిణిలోకి అనుమతించబోమని, భక్తులు ఈ నిర్ణయానికి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
కాగా, ఈ ఏడాది శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి.





