News

650వ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘సంత్ రవిదాస్ మహా అభియాన్’

14views

విజయవాడ: సమానత్వం, సామాజిక సమరసత, మానవతా విలువలను హిందూ సమాజంలో బలోపేతం చేసిన మహనీయ సంత్ రవిదాస్ మహారాజ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ తెలిపారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంత్ రవిదాస్ 650వ జయంతి ఉత్సవాల కార్యశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “సంత్ రవిదాస్ మహా అభియాన్”లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో గురు పౌర్ణమి నుంచి వచ్చే ఏడాది రవిదాస్ జయంతి వరకు అనేక ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్, జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్, రాష్ట్ర కార్యదర్శి గంగిరెడ్డి రాకేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనం శ్రీనివాస్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు ముని సుబ్రహ్మణ్యం, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గూడిసె దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.

సంత్ రవిదాస్ హిందూ భక్తి ఉద్యమానికి మహోన్నత స్ఫూర్తి

పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడుతూ, సుమారు 650 సంవత్సరాల క్రితం జన్మించిన సంత్ రవిదాస్ భారతీయ భక్తి ఉద్యమంలో విశిష్ట స్థానాన్ని సంపాదించారని పేర్కొన్నారు. ప్రతి జీవిలో పరమాత్మ అంశం ఉందని, కులం, వర్ణం, మత భేదాలకు అతీతంగా మానవత్వం, భక్తి, ధర్మమే జీవితానికి నిజమైన మార్గమని ఆయన బోధించారని తెలిపారు.

14వ శతాబ్దంలో విదేశీ దాడులు, బలవంతపు మత మార్పిడులు, సామాజిక వివక్షలు తీవ్రంగా ఉన్న కాలంలో సంత్ రవిదాస్ హిందూ సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక సమరసత భావనలను బలంగా చాటారని అన్నారు. వివక్షను ఎదుర్కొన్నప్పటికీ ద్వేషాన్ని కాకుండా ప్రేమ, భక్తి, సేవా భావంతో సమాజ సంస్కరణ కోసం కృషి చేయడం ఆయన గొప్పతనమని కొనియాడారు.

గురు గ్రంథ్ సాహిబ్‌లో స్థానం పొందిన రవిదాస్ దోహాలు

సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో పద్యాలు, దోహాలు, భక్తి గీతాల ద్వారా సంత్ రవిదాస్ ధర్మ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. ఆయన ఆధ్యాత్మిక మహోన్నతతకు నిదర్శనంగా సిక్కు మత పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్లో ఆయన రచించిన 41 దోహాలకు స్థానం లభించడం విశేషమని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ‘సంత్ రవిదాస్ మహా అభియాన్’

గురు పౌర్ణమి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే సంత్ రవిదాస్ జయంతి వరకు రాష్ట్రవ్యాప్తంగా కలశ యాత్రలు, సామాజిక సమరసత సభలు, పుస్తకావిష్కరణలు, లఘు చిత్రాల ప్రదర్శనలు, యువతకు అవగాహన కార్యక్రమాలు, గ్రామస్థాయి చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు మాధవ్ వెల్లడించారు.

సంత్ రవిదాస్ బోధించిన సమానత్వం, సోదరభావం, ధర్మాచరణ, మానవతా విలువలను ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి చేర్చడమే ఈ మహా అభియాన్ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కుల, వర్గ, మత భేదాలకు అతీతంగా హిందూ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి సామాజిక సమరసతను మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.