
రైళ్లలో ప్రయాణించే వారికి కోసం రైల్వే శాఖ మరో సదుపాయం తీసుకొచ్చింది. ప్రయాణంలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడాన్ని మరింత సులభతరం చేసింది. వాట్సాప్ ద్వారా ఇకపై ఈ సేవలను పొందే సదుపాయాన్ని తీసుకొచ్చింది. తమ ఈ-కేటరింగ్ సేవలను మరింత సులభతరం చేయడంలో భాగంగా తొలుత ఎంపిక చేసిన రైళ్లలో ఈ సేవలను తీసుకొచ్చినట్లు తెలిపింది.
ఐఆర్‌సీటీసీ ప్రస్తుతం www.ecatering.irctc.co.in, ఫుడ్ ఆన్ ట్రాక్ అనే యాప్ ద్వారా ఈ సదుపాయాన్ని అందిస్తోంది. తాజాగా 87500 01323 అనే వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ట్రైన్ టికెట్ బుక్ చేసుకోగానే ఈ వాట్సాప్ నంబర్ నుంచి ఈ-కేటరింగ్ సర్వీస్ సేవలకు సంబంధించి www.ecatering.irctc.co.in వెబ్‌సైట్ లింక్ వస్తుంది. అక్కడ కస్టమర్లు అందుబాటులో ఉన్న స్టేషన్లలో తమకు నచ్చిన రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి ఏఐ ఆధారిత చాట్‌బోట్ ఈ కేటరింగ్‌కు సంబంధించిన సేవలను నేరుగా అందిస్తుంది.
ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ ఈ-కేటరింగ్ ద్వారా రోజుకు ఐఆర్‌సీటీసీ 50 వేల మీల్స్‌ను ప్రయాణికులకు అందిస్తున్నామని రైల్వే శాఖ తెలిపింది. ప్రస్తుతానికి ఎంపిక చేసిన రైళ్లలో మాత్రమే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా మిగిలిన రైళ్లకూ విస్తరిస్తామని తెలిపింది. ఇప్పటికే జూప్ అనే థర్డ్‌పార్టీ ఆన్‌లైన్ పుడ్ ప్లాట్‌ఫాం గతేడాదే వాట్సాప్ చాట్‌బోట్ ద్వారా రైళ్లలోకి ఆహారాన్ని అందించే సేవలను ప్రారంభించింది.





