News

అణుబాంబుతో వెళ్లి విదేశీయులను డబ్బులు అడగాలని సూచించిన పాక్‌ నాయకుడు! సంచలనంగా మారిన వ్యాఖ్యలు?

90views

ఆర్థిక సంక్షోభం నివారణకు ఓ వింతైన పరిష్కారాన్ని పాకిస్థాన్ నాయకుడు ఒకరు సూచించారు. ఆయన వ్యాఖ్యలు పెద్దఎత్తున దుమారం రేపాయి. యుద్ధాల వల్ల గుణపాఠం నేర్చుకున్నామని, ఉగ్రవాదానికి బీజాలు నాటింది మనమేనని ఆ దేశ ప్రధాన మంత్రి, మరో మంత్రి చెప్పినదానికి పూర్తి విరుద్ధంగా ఆ నేత వ్యాఖ్యలు ఉన్నాయి.

పాకిస్థానీ మీడియా కథనాల ప్రకారం… తెహరీక్-ఈ-లబ్బాయిక్ పాకిస్థాన్ పార్టీ నేత సాద్ రిజ్వీ లాహోర్‌లో జరిగిన ఓ బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇతర దేశాలకు వెళ్లి బిచ్చమెత్తడానికి బదులుగా, అణుబాంబు తీసుకెళ్లి నిధులు అడగాలని అన్నారు. ప్రధాన మంత్రి షరీఫ్ ఆర్థిక సాయం కోసం తన కేబినెట్ మంత్రులను, ఆర్మీ చీఫ్‌ను ఇతర దేశాలకు పంపిస్తున్నారని, వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారని తాను అడుగుతున్నానని అన్నారు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిందని వాళ్లు చెప్తున్నారన్నారు. దీనికి బదులుగా నేను వారికి ఓ సలహా ఇస్తున్నానని అంటూ, ఓ చేతితో ఖురాన్‌ను పట్టుకుని, మరో చేతితో అణుబాంబు సూట్‌కేసును తీసుకెళ్లాలని చెప్పారు. స్వీడన్ వెళ్లి తాము ఖురాన్‌ను కాపాడటానికి వచ్చామని చెప్పాలన్నారు. ‘‘అప్పుడు ఈ విశ్వమంతా మీ కాళ్ళ క్రిందకు రాకపోతే, మీరు నా పేరు మార్చండి’’ అన్నారు. అవసరాలు తీరాలంటే ఇతర దేశాలను బెదిరించాలన్నారు.

ఈ పార్టీని గతంలో పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధించింది. సాద్ రిజ్వీ పేరును అనుమానిత ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించాలని, ఆయనను లాహోర్ జైలు నుంచి విడుదల చేయాలని 2021లో అప్పటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ఈ పార్టీ నేతలు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు.

పాక్ ప్రధాని షరీఫ్ గత నెలలో అల్ అరేబియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత దేశంతో మూడు యుద్ధాలు చేశామని, గుణపాఠం నేర్చుకున్నామని చెప్పారు. ఇప్పుడు తాము శాంతిని కోరుకుంటున్నామన్నారు. అయితే కశ్మీరులో జరుగుతున్నదానిని ఆపాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు.

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఉన్న ఓ మసీదులో జనవరి 31న ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దారుణ సంఘటనలో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 170 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ ఇటీవల మాట్లాడుతూ, ఉగ్రవాద బీజాలను నాటినది పాకిస్థానేనని చెప్పారు. ప్రార్థన చేసుకునేవారు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఇండియాలో కానీ, ఇజ్రాయెల్‌లో కానీ జరగలేదన్నారు. ఒకవైపు అధికారంలో ఉన్న నాయకులు శాంతి కోరుకుంటుంటే.. మరి కొందరు హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.