ArticlesNews

అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతకు దారితీస్తున్న గూఢచార బుడగలు..! అసలు స్పై బుడగలను ఎందుకు వినియోగిస్తారంటే?

FILE PHOTO: A balloon flies in the sky over Billings, Montana, U.S. February 1, 2023 in this picture obtained from social media. Chase Doak/via REUTERS
53views

గూఢచార బుడగలు అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతకు దారి తీశాయి. అమెరికా గగనతలంలో చైనా గూఢచార బుడగలు ఎగురుతుండటంతో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. భద్రతా కారణాలతో ఈ బుడగలను కూల్చలేదని పెంటగాన్ వెల్లడించింది. వీటిని రాడార్లు కూడా గుర్తు పట్టలేవని నిపుణులు చెప్తున్నారు.

చైనా గూఢచార బుడగలు ఇటీవల అమెరికాలోని మోంటానా, లాటిన్ అమెరికాలలో కనిపించాయి. మోంటానాలో వైమానిక స్థావరాలు, వ్యూహాత్మక క్షిపణులు ఉంటాయి. భద్రతా కారణాల వల్ల ఈ బుడగలను కూల్చలేదని పెంటగాన్ తెలిపింది.

అసలు ఆ బెలూన్స్‌ ఎందుకు వినియోగిస్తారంటే?
స్పై బెలూన్స్‌ను అబ్జర్వేషన్ బెలూన్స్ అని కూడా అంటారు. ఇవి హాట్ ఎయిర్ బెలూన్స్. వీటిని నిఘా పెట్టడం కోసం వినియోగిస్తారు. వీటిలో గూఢచర్యానికి సంబంధించిన కెమెరాలు, ఇతర సెన్సర్లు ఉంటాయి. వీటిని ఫ్రెంచ్ విప్లవ యుద్ధాల సమయంలో మొదట ఉపయోగించారు. సైన్యంలో వీటిని అమెరికన్ సివిల్ వార్‌లో 1860వ దశకంలో ఉపయోగించారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో వీటి వాడకం మరింత పెరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపనీయులు హాట్ ఎయిర్ బెలూన్స్‌కు ఆయుధాలు అమర్చి అమెరికా భూభాగంలో బాంబులు వేసేవారు.

వాషింగ్టన్‌లోని మారథాన్ ఇనీషియేటివ్ థింక్ ట్యాంక్‌లో సర్విలెన్స్ బెలూన్స్ నిపుణుడు విలియం కిమ్ మాట్లాడుతూ.. నిఘా బుడగలను కూల్చివేయడం చాలా కష్టమని చెప్పారు. క్షుణ్ణంగా పరిశీలించడానికి, సునాయాసంగా నడపటానికి ఈ స్పై బెలూన్స్ బాగా ఉపయోగపడతాయన్నారు. ఇవి చూడటానికి సాధారణ వాతావరణ పరిశీలక బెలూన్స్ మాదిరిగానే ఉంటాయని, అయితే వీటికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయని చెప్పారు. వీటిని రాడార్లు కూడా గుర్తించలేవన్నారు. ప్రతిఫలించని, ప్రతిధ్వనించని, ప్రతిబింబించని మెటీరియల్స్‌తో వీటిని తయారు చేస్తారన్నారు. ఇవి చాలా పెద్దగా విస్తరించగలవని, ఇవి తమంతట తామే ఓ సమస్య అన్నారు.

సర్విలెన్స్ బెలూన్స్ (నిఘా బూరాలు) 65 వేల అడుగుల నుంచి 1 లక్ష అడుగుల ఎత్తులో కార్యకలాపాలు నిర్వహిస్తాయని రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారి పీటర్ లేటన్ తెలిపారు. వీటికి నిర్దేశించిన లక్ష్యం మీద నెలల తరబడి స్థిరంగా ఉంటూ, నిఘాపెట్టగలవన్నారు. ఉపగ్రహాలు కక్ష్యలో తిరుగుతూ ఉంటాయని, ఈ నిఘా బుడగలు మాత్రం స్థిరంగా పని చేయగలవని చెప్పారు. మరోవైపు ఇవి తక్కువ బరువుతో, చిన్న పరిమాణంలో ఉంటాయని, ఉపగ్రహాలతో పోల్చితే వీటిని ప్రయోగించడం తేలిక అని చెప్పారు. అంతేకాకుండా ఇవి రాడార్ నుంచి కూడా తప్పించుకోగలుగుతాయన్నారు. గాలి వీచే స్థితినిబట్టి ఈ బుడగల సేవలను ఆన్‌బోర్డ్ కంప్యూటర్ల ద్వారా వినియోగించుకోవచ్చునని మరో నిపుణుడు చెప్పారు.