
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 87 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో (Budget- 2023) కొన్ని కీలక ప్రకటనలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల లోపు (2024 Parliament Elections) ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా బడ్జెట్ ప్రసంగాన్ని టీవీల్లో వీక్షించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ పూర్తిగా చూసి, విన్న తర్వాత ఏఏ వస్తువుల ధరలు పెరగనున్నాయో, ఏఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయో అంశంపై క్లారిటీ వచ్చేసింది.
ముఖ్యంగా ఆదాయపన్ను పరిమితి పెంపు, కొన్నిరకాల వస్తు, సేవల పన్ను శాతాల తగ్గింపు వంటివాటిని నిర్మల ప్రకటిస్తారని అందరూ భావించారు. బీజేపీ వ్యూహాత్మకంగానే వారి ఆశలను నిజం చేసింది. పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. దీంతో.. టీవీలు, మొబైళ్లు, కెమెరాలు, లెన్స్, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి.
టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీ (Customs Duty) 2.5 శాతం తగ్గించింది. లిథియం బ్యాటరీలపై 21 నుంచి 13 శాతానికి కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. కొన్ని వస్తువుల ధరలు తగ్గుతాయని కేంద్ర బడ్జెట్‌తో స్పష్టమైనప్పటికీ కొన్ని వస్తువుల ధరలు భారీగా పెరగనుండటం కూడా గమనార్హం. టైర్లు, సిగరెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. సిగరెట్లపై 16 శాతం పన్ను పెంపుతో పొగరాయుళ్ల జేబులకు చిల్లులు పడటం ఖాయంగా కనిపిస్తోంది. వజ్రాలు, బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో బంగారం, వెండి ధరలు (Gold Prices) కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. బ్రాండెడ్ దుస్తుల ధరలు పెరగనున్నాయి. విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు ధర పెరగనుంది. వీటితోపాటు మరికొన్ని వస్తువుల ధరలపై కేంద్ర బడ్జెట్ ప్రభావం ఏవిధంగా ఉంటుందంటే..
ధరలు తగ్గనున్న వస్తువులివే..
* మొబైల్ ఫోన్లు (Mobile Phones)
* మొబైల్ ఫోన్ల విడి భాగాల ధరలు
* టీవీ ప్యానల్స్ (TV Panel)
* ఎలక్ట్రిక్ వాహనాలు
ధరలు పెరగనున్న వస్తువులివే..
* గోల్డ్ బార్స్ నుంచి తయారయ్యే బంగారు ఆభరణాలు
* సిగరెట్లు
* వెండి
* ఇమిటేషన్ జువెలరీ (గిల్ట్ నగలు)
* ఎలక్ట్రానిక్ కిచెన్ చిమ్నీ
* దిగుమతి చేసుకుని అమ్మే బొమ్మలు, సైకిల్స్
* దిగుమతి చేసుకుని విక్రయించే ఎలక్ట్రానిక్ వాహనాలు
వేతనజీవులకు ఊరట..
వేతనజీవులు, మధ్యతరగతివర్గాలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆశ ఫలించింది. వ్యక్తిగత ఆదాయ పన్నుమినహాయింపు కనిష్ఠ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతూ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను విధించనున్నారు. రూ.7 – రూ.9 లక్షల వరకు 5 శాతం పన్ను, ఆదాయం రూ.30 లక్షలు దాటితే 30 శాతం పన్ను విధింపునకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే ఇది నూతన పన్ను విధానానికి మాత్రమే వర్తిస్తుంది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలనేది పూర్తిగా చెల్లింపుదారుడి ఐచ్ఛికం. ఎందులో ప్రయోజనం ఉంటుందనుకుంటే దానిని ఎంపిక చేసుకోవచ్చు. కాగా పన్ను మినహాయింపులకు సంబంధించి ఆర్థిక నిపుణుల అంచనాలు దాదాపు నిజమయ్యాయి. రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన నూతన పన్ను విధానంలో వేతన జీవులకు ఆకర్షించడమే లక్ష్యంగా స్లాబుల్లో మార్పులు జరగొచ్చునని మొదటి నుంచి విశ్లేషకులు చెబుతూ వచ్చారు. దాదాపు ఇప్పుడు అదే జరిగింది. ఇకపై రిటర్న్ లు దాఖలు చేసే సమయంలో కొత్త ఆదాయ పన్ను విధానం’ డిపార్ట్ ఆప్షన్ గా వస్తుంది. పాత పన్ను విధానంలో ఉన్న వారు. ఎప్పటిలా అందులో పొందుతున్న రాయితీలను మునుపటిలా కొనసాగించవచ్చు. వారు కోరుకుంటే కొత్త పన్ను పరిధిలోకి రావచ్చు.
వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు…
0 నుంచి రూ. 3 లక్షలు – సున్నా
రూ. 3 లక్షలు నుంచి రూ.6 లక్షలు – 5 %
రూ. 6 లక్షలు నుంచి రూ.9 లక్షలు – 10%
రూ. 9 లక్షల నుంచి రూ.12 లక్షలు – 15%
రూ. 12 లక్షల నుంచి రూ.15 లక్షలు – 20%
రూ. 15 లక్షల పైబడిన ఆదాయం – 30%
7 లక్షల వరకు ఆదాయం పొందేవారికి ట్యాక్స్ లేదు.. ఎలాగంటే?
కొత్త పన్ను విధానంలో గతంలో రూ. 5 లక్షల వరకు ఆదాయంపై రిబేట్ ఇచ్చేవారు. కానీ ఈ సారి ఆ రిబేట్ పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రూ. 7 లక్షలకు పెంచారు. రూ.7 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పాత పన్ను విధానంలో ఎటువంటి మార్పు చేయలేదు. అయితే చాలా మందికి బడ్జెట్ స్లాబ్‌లో మూడు లక్షల నుంచి ఆరు లక్షల వరకు ఆదాయం ఉంటే 5 శాతం పన్ను కట్టాలని ఉంది.. అలాంటప్పుడు 7 లక్షలకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. అందుకే వివరణ్మాతక ఊదాహరణ ఇలా…
ఉదాహరణ —
ఓ వ్యక్తి ఏడాదికి రూ.7 లక్షల ఆదాయం పొందుతున్నాడు అనుకుంటే.. తొలి 3 లక్షలకు ఎలాంటి పన్ను ఉండదు. తర్వాత 4 లక్షలకు పై శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ.. ఈ సారి ఆ మొత్తంపై రిబేట్ ను ప్రకటించారు. దీంతో రూ.7లక్షల వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. రిబేటు రూపంలో పన్ను మినహాయింపు వస్తుంది.





