News

ముస్లింలకు అత్యంత భద్రత, శాంతి లభించే దేశం భారత్ – ముస్లిం నాయకుల వెల్లడి

262views

భారత దేశంలో మత స్వేచ్ఛ అపూర్వమని కేరళ ఏపీ సమస్తా నాయకుడు పొన్మల అబ్దుల్ ఖాదర్ ముసల్యార్ పేర్కొన్నారు. జనవరి 28న కోజికోడ్‌లో జరిగిన సున్నీ స్టూడెంట్స్ ఫెడరేషన్ గోల్డెన్ ఫిఫ్టీ స్టేట్ డెలిగేట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ… భారతదేశంలో మత స్వేచ్ఛకు అనుమతులు ఉన్నాయని.. ఇస్లామిక్ సంస్థలు ఇతర దేశాల కంటే ఇక్కడ చాలా చురుకుగా ఉన్నాయన్నారు. సౌదీ అరేబియా, ఖతార్, యుఎఇ, కువైట్, మలేషియా మరియు సింగపూర్ కంటే మన దేశంలో మత స్వేచ్ఛ చాలా మెరుగ్గా ఉందన్నారు. దేశంలోని ఆయన సంస్థ సెంట్రల్ ముషావీరా నుంచి జోనల్ ముషావీరా వరకు పనిచేస్తుందన్నారు. భారత్‌లో ఉన్నటువంటి గ్రాస్ రూట్ లెవల్ మతస్వేచ్ఛ మరే దేశంలోనూ కనిపించలేదన్నారు. సౌదీ అరేబియాలో కూడా తాను ఇంతటి స్వేచ్ఛను చూడలేదన్నారు. భారత్‌లో శుక్రవారం ప్రసంగాల కోసం ముస్లింలు మైక్రోఫోన్‌ను ఉపయోగించుకునే స్వేచ్ఛ ఉందని ముసల్యార్ పేర్కొన్నారు.

సున్నీ తత్వశాస్త్రం తీవ్రవాదానికి వ్యతిరేకం..
ఇక మరో వక్త.. కాంఠాపురం ఎ.పి.అబూబకర్ ముసల్యార్ మాట్లాడుతూ.. తీవ్రవాదం, ఉగ్రవాదం ఏ సమస్యకూ పరిష్కారం కాదని అన్నారు. సున్నీ తత్వశాస్త్రం తీవ్రవాదానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. పాలక యంత్రాంగాన్ని వ్యతిరేకించడం కోసం దేశాన్ని అవమానించరాదని సదస్సు ఆమోదించిన తీర్మానంలో పేర్కొంది. కేరళ నద్వతుల్ ముజాహిదీన్ (కెఎన్‌ఎం) రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ మజీద్ సలాహి మాట్లాడుతూ… ముస్లింలకు అత్యంత భద్రత, శాంతి లభించే దేశం భారత్ అని అన్నారు. జనం టీవీతో మాట్లాడిన ఆయన.. తీవ్రవాదం ప్రమాదంపై యువతకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలన్నారు.

 

source- vsk bharath