
అశేష భక్త జనుల జయజయ ధ్వానాల నడుమ ఆదివారం ఆగిరిపల్లిలో శోభజనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. మహిళలు, యువకులు గోవిందనామ స్మరణతో రథాన్ని ముందుకు లాగి పరవశులయ్యారు. రథంపై అధిరోహించిన స్వామి వారిని దర్శించుకుని భక్తజనం పులకించారు. గ్రామంలోని నాలుగు మాడ వీధుల ద్వారా దాదాపు ఐదు గంటలపాటు ఈ రథోత్సవం జరిగింది. మేళతాళాలు, తీన్‌మార్ డప్పు వాయిద్యాలు, మహిళల కోలాట భజనలు, కేరళ డ్రమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానిక కల్యాణ మండపం వద్ద ఆలయ అర్చకులు వేదాంతం శేషుబాబు, జి.రామ అనంతకృష్ణ రథంపై స్వామి వారిని అలంకరించారు. తహసీల్దార్ ఎం.ఉదయభాస్కరరావు, సర్పంచి భర్త విక్టర్ బాబు, సీఐ ఆర్.అంకబాబు కుంభం పోసి సంప్రదాయబద్దంగా రథోత్సవాన్ని ప్రారంభించారు. ఎస్సై ఎన్.చంటి బాబు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించగా ఆలయ ఈవో ఎన్.భవాని తదితరులు పాల్గొన్నారు.
కమనీయం రాధాకృష్ణ కల్యాణం…
శోభనాచల స్వామివారి తిరుణాళ్లలో భాగంగా శనివారం రాత్రి కల్యాణ మండపంలో రాధాకృష్ణ కల్యాణం కమనీ యంగా సాగింది. స్వామి వార్లకు గోదా అమ్మ వారికి దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. కొట్నాల, ఊంజల సేవలు నేత్రపర్వంగా జరిగాయి.





