ArticlesNews

పాక్‌ రూపాయి మరింత పతనం.. అంతా అల్లా దయ అంటున్న ఆర్థిక మంత్రి!

376views

మూలిగే నక్కపై తాటికాయ పడిందన్న చందంగా తయారైంది పాకిస్థాన్‌ దేశ పరిస్థితి. నగదు కొరతతో ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న పాక్‌ కరెన్సీ విలువ భారీగా క్షీణిస్తోంది. శుక్రవారం డాలర్‌ మారకంలో దేశ కరెన్సీ విలువ ఇంతకు ముందెన్నడూ లేని కనిష్ఠం రూ.262.2 స్థాయికి దిగజారింది. ఓపెన్‌ మార్కెట్లో ఒక దశలో రూ.265 స్థాయికి, ఇంటర్‌ బ్యాంకులో రూ.266 స్థాయికి క్షీణించింది. ఈక్రమంలో పాకిస్థాన్‌ ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యాలు చేశారు. ఇస్లాం పేరుతో స్థాపించిన ఏకైక దేశం పాకిస్థాన్‌ అని… ఈ దేశ అభివృద్ధి, సౌభాగ్యానికి అల్లాదే బాధ్యతని ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌ అన్నారు. పాక్‌ తీవ్ర చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ ఇస్లాం పేరుతో సృష్టించబడినందు వల్ల అభివృద్ధి చెందుతుందన్న సంపూర్ణ విశ్వాసం తనకు ఉందన్నారు. అల్లా దేశాన్ని రక్షించడమేకాకుండా అభివృద్ధి, సుసంపన్నం చేయగలడు అని వ్యాఖ్యానించడం అత్యంత హాస్యాస్పదాన్ని కలిగిస్తున్నాయి.

రూపాయి పతనానికి కారణాలు ఇవే..
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ ప్రకారం.. శుక్రవారం మార్కెట్‌ ప్రారంభమైనప్పుడు కరెన్సీ విలువ గురువారం ముగింపుతో పోల్చితే రూ.7.17 (2.73 శాతం) క్షీణించింది. ఇక గురువారం నుంచి పాకిస్థాన్‌ రూపాయి రూ.34 మేర క్షీణించింది. నూతన మారకపు రేటు వ్యవస్థను ప్రారంభించిన 1999 నుంచి ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయిలో రూపాయి విలువ క్షీణించలేదు. ఐఎంఎఫ్‌ నుంచి నిధులను పొందడానికి విధించిన షరతుల మేరకు డాలర్‌-రూపాయి మారకపు రేటుపై ప్రభుత్వం పరిమితులను తొలగించడం పాక్‌ రూపాయి విలువ క్షీణతకు దారితీస్తోంది. ఐఎంఎఫ్‌ 700 కోట్ల డాలర్ల ప్యాకేజీకి సంబంధించి తొమ్మిదో సమీక్షను దేశం పూర్తి చేయాల్సి ఉంది. ఇది పూర్తయితే 120 కోట్ల డాలర్ల నిధుల పంపిణీకి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్నేహపూర్వక దేశాలు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే.. కరాచీ పోర్టుల్లో బకాయిల చెల్లింపుల కోసం 9వేలకు పైగా కంటైనర్లు నిలిచిపోయాయి. మరోవైపు పాక్‌ విదేశీ మారకం నిల్వలు తొమ్మిదేళ్ల కనిష్ఠ స్థాయిలో 3.678 బిలియన్‌ డాలర్లకు క్షీణించాయి.

అల్లా ఉంటే… ఐఎంఎఫ్‌ ఎందుకు..
రూపాయి పతనం అవుతున్న కారణాలు, నష్టనివారణ చర్యల గురించి తెలియజేయాల్సిన పాకిస్థాన్‌ ఆర్థిక మంత్రి అత్యంత హాస్యాస్పద వ్యాఖ్యలు చేసి మరింత నవ్వులపాలయ్యారు. పాక్‌లో ఉగ్రవాదం పెరిగిపోవడం.. ఆ దేశంలో వేరే ఇతర మతస్థులు జీవించే పరిస్థితులు లేకపోవడం ప్రధాన సమస్య. దీంతోపాటు అక్కడి నాయకులు తీసుకున్న స్వార్థపూరిత రాజకీయ నిర్ణయాల వల్ల ఆ దేశ ప్రజలు నేడు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించాల్సింది పోయి.. అంతా అల్లా దయ అనడం విడ్డూరంగా ఉంది. సరే అల్లానే ఉన్నడనుకుంటే.. మరి ఐఎంఎఫ్‌ వంటి ఆర్గనైజేషన్ల వద్ద డబ్బులు ఇవ్వాలని దేహా అని అడుక్కోవడం ఎందుకు. ఇలాంటి మాటలు కేవలం వారి స్వార్థ ప్రయోజనాల కోసమే అని అర్ధం చేసుకోవచ్చు.