News

కనుల పండువగా ద్వారకాతిరుమలలో రథసప్తమి వేడుకలు

530views

ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల దేవాలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సూర్యప్రభ వాహనంపై ఉభయదేవేరులతో కొలువైన శ్రీవారు ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయ ముఖమండపం వద్ద సూర్యప్రభ వాహనంపై స్వామి అమ్మవార్లను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం అర్చనాది కార్యక్రమాలను నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు హారతులను సమర్పించారు. ఆపై అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి వాహనం ఆలయ ప్రాంగణంలో విహరించింది. పలువురు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు. దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు ఈ ఉత్సవ వేడుకలను పర్యవేక్షించారు.