
అనధికారికంగా బెంగళూరులో నివాసముంటున్న పాకిస్తాన్ యువతిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఆధార్ కార్డు, ఇతర పత్రాలు సృష్టించి బెంగళూరు నగరంలో తన భర్తతో కలిసి ఉంటోంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు బెంగళూరు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. పాకిస్థాన్ దేశంలోని సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్ నగరానికి చెందిన ఇక్రా జీవి అనే టీనేజ్ అమ్మాయి.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ ను వివాహం చేసుకుని బెంగళూరులో(Bengaluru) నివాసముంటోంది. ఈ అమ్మాయి.. యూపీకి చెందిన అతన్ని గేమింగ్ యాప్ లూడో ద్వారా పరిచయం చేసుకొని ఆ తర్వాత వివాహం చేసుకుంది. ములాయం సింగ్ బెంగళూరు నగరంలోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు.
పాక్‌కు ఫోన్ కాల్స్ చేస్తుండగా..
పాక్‌కు చెందిన ఇక్రా జీవి అనే యువతి ఆ దేశంలో ఉంటున్న బంధువులు, తల్లిదండ్రులతో తరచూ ఫోన్లు మాట్లాడటాన్ని ఇంటెలిజెన్స్ సంస్థ గుర్తించింది. వాటి ఆధారంగా ఆమె అనధికారికంగా భారత్‌లో ఉంటుందని గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. యువతితోపాటు అతని భర్తపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ములాయం సింగ్ యాదవ్ ఇక్రా జీవిని గత ఏడాది సెప్టెంబర్ నెలలో నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి భారతదేశానికి రప్పించాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరును రావా యాదవ్‌గా మార్చి నకిలీ ఆధార్ కార్డును పొందారు. దీంతోపాటు ఇండియన్ పాస్‌పోర్టుకు దరఖాస్తు సైతం యువతి భర్త చేశాడు. ఈక్రమంలో పాక్ యువతిని పోలీసులు అరెస్టు చేసి వివరాలు రాబడుతున్నారు. ఆమె ఏదైనా గూఢచర్యంకు పాల్పడుతుందా అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతం ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారులకు యువతిని అప్పగించారు.