
కశ్మీరులోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) సమీప ఆలయంలో ప్రతిష్ఠించనున్న శారదా మాత విగ్రహం కర్ణాటకలోని శృంగేరి శారదామాతా పీఠం (సరస్వతీ దేవి) సిద్ధం చేసింది. ఈ పంచలోహ విగ్రహాన్ని అక్కడికి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే మంగళవారం అక్కడికి తీసుకెళ్లనున్నట్లు సేవ్ శారదా కమిటీ కశ్మీర్ వ్యవస్థాపకుడు రవీందర్ పండిత్ తెలిపారు. ఎల్‌ఓసీకి సమీపంలోని టీట్వాల్ గ్రామంలో జీర్ణోద్ధరణ చేసిన ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. శృంగేరి నుంచి బెంగళూరు, ముంబయి, పుణె, అహ్మదాబాద్, జైపూర్, ఢిల్లీ మార్గం నుంచి ప్రతిమను రథంలో తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. మార్చి 22న ఆలయంలో ప్రతిష్టిస్తామన్నారు.
టీట్వాల్ గ్రామంలో సిద్ధమైన ఆలయం…
టీబ్వాల్లో సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు శారదా పీఠం మద్దతుగా నిలుస్తోందని తెలిపారు. శృంగేరి ఆలయంలోని అమ్మవారి విగ్రహ నమూనానే కశ్మీరుకు పంపిస్తున్నామని మఠం ముఖ్య కార్యనిర్వహణ అధికారి వీఆర్ గౌరీశంకర్ తెలిపారు.





