
తిరుమలలో క్వార్టర్స్ భవనాల మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు 50 నుంచి 60 ఏళ్ల క్రితం ఉద్యోగుల కోసం నిర్మించిన క్వార్టర్స్ కళాహీనంగా మారడంతోపాటు మరమ్మతులకు గురయ్యాయి. పైకప్పు పెచ్చులు ఊడటంతోపాటు వర్షం కురిసిన సమయంలో నీరు దిగడం, డ్రైనేజీ పైపులు పగిలిపోవడం, దుర్గంధం వంటి సమస్యలతో క్వార్టర్స్ పరిస్థితి దారుణంగా మారాయి. ఈక్రమంలోనే టీటీడీ బోర్డు తిరుమలలోని ఉన్న డీటైప్, బీటైప్, సీటైప్, స్టాఫ్ క్వార్టర్స్‌లోని దాదాపు 400 గదులను మరమ్మతులు చేయాలని గత ఏడాది నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలిదశలో రూ.19కోట్ల నిధులను జారీ చేశారు. ఈ క్రమంలోనే బ్రహ్మోత్సవాలకు ముందే ఇంజనీరింగ్-5 విభాగం దాదాపు 54 గదుల మరమ్మతులు పూర్తిచేసి అధునాతన వసతులతో తిరిగి అందుబాటులోకి తెచ్చింది. ఇకా, బీటై్‌పలోని 32 గదుల మరమ్మతు పనులు కూడా ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. ఇందులో ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. వీటిని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు పనిచేస్తున్నారు.
అదనంగా భక్తులకు వసతి కల్పించే అవకాశం…
తిరుమలలో దాదాపు 7,500 గదులు ఉన్నాయి. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వీటిని కేటాయిస్తుంటారు. వీటిల్లో దాదాపు 750 గదులు కొన్నేళ్ల నుంచి శాశ్వత కేటాయింపుల్లో ఉన్నాయి. టీటీడీలో పనిచేసే వివిధ విభాగాల అధికారులు, పోలీసులు, విజిలెన్స్, ఇతర శాఖల వారికి వీటిని కేటాయిస్తూ వస్తున్నారు. ఐదారేళ్ల నుంచి తిరుమలకు రద్దీ పెరుగుతున్న క్రమంలో వసతి కష్టాలు కూడా పెరిగాయి. నూతన నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలున్న క్రమంలో టీటీడీ కూడా ఏం చేయలేక భక్తుల వసతి కష్టాలను చూస్తూ వచ్చింది. కొంతలోకొంతైన వసతి కష్టాలను తగ్గించడంలో భాగంగా టీటీడీ శాశ్వత కేటాయింపుల్లో ఉన్న గదులను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే టీటీడీ రెవెన్యూ విభాగం ఇప్పటికే 500 గదులను సిబ్బంది నుంచి ఖాళీ చేయించింది. వీరికి మరమ్మతులు పూర్తిచేసుకున్న క్వార్టర్స్‌లోని గదులను కేటాయించారు. ప్రస్తుతం జరుగుతున్న గదుల మరమ్మతులను కూడా వేగంగా పూర్తిచేసి మిగిలిన ఉన్నతాధికారులు, పోలీసులు, విజిలెన్స్, డిప్యూటీ ఈవోలకు కేటాయించాలని టీటీడీ ప్రణాళికలు రూపొందించుకుంది. ఫలితంగా త్వరలోనే మరో వంద నుంచి 150 గదులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఇలా, మొత్తం శాశ్వత కేటాయింపుల్లో ఉన్న గదులను అందుబాటులోకి తీసుకొస్తే అదనంగా రోజుకు మూడు వేల నుంచి నాలుగు వేల మంది భక్తులకు వసతి కల్పించవ్చని టీటీడీ భావిస్తోంది.





