
కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం మరో మారు తన హిందూ వ్యతిరేక ధోరణిని ప్రదర్శించింది. ఒక సభలో కేరళ సి.ఎం పినరయ్ విజయన్ ప్రసంగిస్తుండగా సభా స్థలికి సమీపంలోని గుడిలో జరుగుతున్న భజనను ముఖ్య మంత్రి ప్రసంగానికి ఆటంకంగా భావించిన సిపిఎం కార్యకర్తలు ఆ దేవాలయానికి అప్పటికప్పుడు విద్యుత్ సరఫరాను తొలగించిన సంఘటన కేరళలో చోటు చేసుకుంది.
ప్రస్తుత ఎన్నికలలో భాగంగా కేరళలోని అత్తింగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎల్.డి.ఎఫ్ అభ్యర్ధి ఏ. సంపత్ తరపున ప్రచారానికి వెళ్ళిన కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కట్టక్కటలో ఒక సభలో ప్రసంగిస్తున్న సమయంలో సమీపంలోని ముదిప్పుర ప్రాంతంలోని ఒక గుడిలోనున్న మైకులోనుంచి భజనలు వినిపించాయి. ఆ రోజు కేరళ హిందూ నూతన సంవత్సరాది విషు సందర్భంగా భక్తులు అక్కడ భజన నిర్వహించుకుంటున్నారు. తన ప్రసంగానికి ఆటంకం కలుగుతుందని భావించిన ముఖ్యమంత్రి విజయన్ తన కార్యకర్తలపై ఆగ్రహించారు. వెంటనే ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వి. శివకుట్టి, ప్రస్తుత ఎమ్మెల్యే ఐ. బి సతీష్ కుమార్లు హుటా హుటిన గుడికి చేరుకొని మైకు పనిచెయ్యకుండా విద్యుత్ సరఫరాను నిలిపి వచ్చారు. ఆ తర్వాత సి.ఎం తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సంఘటనను మీడియా ప్రసారం చెయ్యకుండా సి.పి.ఎం నాయకులు అడ్డుకున్నారు.
శబరిమల ఉద్యమం అనంతరం కేరళలో ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ఆయన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అయ్యప్ప మరియు ఇతర హిందూ దేవుళ్ళ ప్రార్ధనలు, భజనలపై తమ అసహనాన్ని వ్యక్తం చెయ్యడం ఇది మొదటి సారి కాదు.
ఇదే ముఖ్యమంత్రి ఇదే విధంగా తాను ఒక సభలో ప్రసంగం మధ్యలో సమీపంలోని మసీదు నుంచి ప్రార్ధన వినపడగానే తన ప్రసంగాన్ని నిలిపివేసి అది పూర్తయ్యే వరకు మౌనం దాల్చిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనార్హం.





