News

తిరుమలలో భక్తుల అవస్థలు.. స్వామిని దర్శించుకోవాలంటే నరకం చూస్తున్న వైనం.. ఎందుకంటే?

279views

ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం సామాన్యులకు నరకప్రాయంగా మారిందని.. పలువురు సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి పర్వదినాలలో స్వయంగా శ్రీవారి దర్శనానికి వెళ్లి క్యూ కాంప్లెక్స్ లో వారు అనుభవించిన నరకాన్ని మీడియా ముందు వెల్లడించారు. గతంలో వైకుంఠ ఏకాదశి అంటే రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కలుగజేసే వారని, కానీ నేడు పది రోజులు ఏకధాటిగా దర్శనాలు కల్పిస్తామని, గొప్పలు చెప్పి వీఐపీల సేవలో తరిస్తూ క్యూ కాంప్లెక్స్ లలో భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడారని ఆరోపించారు. టీటీడీ పాలకమండలి యాజమాన్యం అసలు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారా లేక వేరే మతాన్ని ప్రోత్సహిస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ సందర్బంగా సామాజిక వేత్తలు మాంగాటి గోపాల్ రెడ్డి, జగన్నాథం నాయుడు, సుధాకర్ రెడ్డి, కన్నారెడ్డి, పార్థసారధిలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఏకాదశి పర్వదినాలలో టోకెన్లు కట్టుకున్న వారిని ఉసిగొలిపేలా రన్నింగ్ క్యూ అని ప్రచారం చేసి, జన భక్తసంద్రం తరలివచ్చేలా చేసి వారి అనారోగ్యానికి కారుకులయ్యారని దుయ్యబట్టారు. తిరుపతిలో ఉచిత దర్శనాల కోసం దాదాపు తొమ్మిది కౌంటర్లను ఏర్పాటు చేసి టోకెన్లను జారీ, దర్శన భాగ్యం కల్పించే కోణంలో పూర్తిగా టీటీడీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీల సేవలో పడి…. గంటల తరబడి సామాన్యులను క్యూ కాంప్లెక్స్ ఉంచడం దారుణమన్నారు. స్వామి వారి దర్శనానికి వెళ్లిన ఎందరో స్థానికులు వారి అవస్థలను చెప్పుకుంటున్నారన్నారు. అధికారులు ఇకనైనా తీరు మార్చుకొని, మరోసారి ఇది పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని డిమాండ్ చేశారు.

కొనసాగుతున్న భక్తుల రద్దీ…
బుధవారం ఒక్క రోజే 68,855 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 21,280 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించగా.. స్వామి వారికి 3.61 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం లభించింది. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 7 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు దాదాపుగా 24 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.