News

పాక్‌ ప్రభుత్వ విధానాలు అరాచకం.. ప్లీజ్‌ మమ్మల్ని భారత్‌లో కలిపేయండి అంటున్న ఆ ప్రాంత ప్రజలు?

279views

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని గిల్గిట్-బాల్టిస్థాన్‌లలో ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వ విధానాలు తమ పట్ల వివక్షపూరితంగా ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోల ఆధారంగా ప్రభుత్వంపై వీరి ఆగ్రహం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

భారత దేశంలోని లడఖ్‌ ప్రాంతంలో తమను తిరిగి కలిపేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నట్లు ఓ వీడియోలో కనిపించింది. కార్గిల్ రోడ్డును తెరచి, భారతలోని లడఖ్‌లో ఉన్న తమ తోటి బాల్టిస్‌లతో తమను కలపాలని కోరుతున్నట్లు కనిపించింది. ఈ ప్రాంతంలో గత కొద్ది నెలల నుంచి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. లోడ్ షెడ్డింగ్, చట్టవిరుద్ధ భూ ఆక్రమణలు, సహజ వనరుల దోపిడీ వంటి అంశాలపై వీరు పోరాడుతున్నారు.

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు మాజీ ప్రధాన మంత్రి రజ ఫరూఖ్ హైదర్ కూడా నిరసన గళం వినిపించారు. అవామీ యాక్షన్ కమిటీ పూంఛ్ జిల్లాలోని హజీరా సబ్‌డివిజన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… భద్రతా దళాలు ఈ ప్రాంతంలో భూ కబ్జాలకు పాల్పడుతున్నాయని, ఈ దారుణానికి తెరదించాలని డిమాండ్ చేశారు. స్థానికుల హక్కులకు రక్షణ కల్పించాలని కోరారు. ఖల్సా భూమి నుంచి గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రజలను ఖాళీ చేయించవద్దని కోరారు. డోగ్రా పాలన కాలం నుంచి వీరు ఇక్కడ జీవిస్తున్నారని చెప్పారు.