
దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని వివిధ దేవాలయాలో పనిచేస్తున్న అర్చకులు, వారి కుటుంబ సభ్యులకు ఏదైనా కారణం చేత అనారోగ్యం బారిని పడినప్పుడు వైద్యం కోసం చేసిన ఖర్చులో ప్రస్తుతం అర్చక సంక్షేమ నిధి నుంచి 50% వరకు మాత్రమే చెల్లించడం జరుగుతోంది. వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తమ ప్రభుత్వం, ఈనాం భూముల పైన వంతుల వారీగా, ధూప దీప నైవేద్యం పథకం కింద, నెలవారి వేతనంపై పనిచేస్తున్న అర్చకులందరికీ ఇకపై నూరుశాతం (100%) వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపులు చేయటం జరుగుతుందని ఉపముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ప్యానల్ డాక్టర్ నిబంధనల మేరకు సూచించిన మొత్తం ఖర్చును చెల్లించే విధంగా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి అన్నారు. దీనిని తక్షణమే అమలులోకి తీసుకువచ్చేలా అధికారులను ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. ఇటీవల ప్రారంభించిన అర్చక మరియు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ఆన్లైన్ వెబ్ సైట్
www.aparchakawelfare.org ద్వారా అర్జీలు నమోదు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.





