News

ఆయుధాలు అక్రమంగా తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు!

283views

మధ్యప్రదేశ్ లో అక్రమంగా ఆయుధాలు తయారు చేసే 9 కేంద్రాల‌ను అనంతపురం పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఆయుధాలు, తూటాలు తయారు చేసి అక్రమంగా రవాణా చేయడమే కాకుండా గంజాయి వంటి మాదక ద్రవ్యాలు కూడా విక్రయిస్తున్నట్లు ప్రత్యేక బృందం దర్యాప్తులో తెలియజేసింది. దీనిపై మరింత దర్యాప్తు చేయాల్సి ఉందని జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. అనంతపురం జిల్లా డీ-హీరేహళ ప్రాంతంలో పట్టుబడిన అక్రమ ఆయుధాల కేసు విచారణలో ఇవి బట్టబయలయ్యాయి. గత డిసెంబర్ 25న నిర్వహించిన దాడుల్లో అక్రమ రవాణాకు సిద్దంగా ఉంచిన వివిధ రకాల తుపాకులు, తూటాలు దొరికాయి. ఈ సందర్భంగానే పోలీసులు నిందితులైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన జంషీద్, ముబారక్, అమీర్ పాషా, గోవాకు చెందిన రియాజ్ షేక్, మధ్యప్రదేశ్ కు చెందిన రాజ్ పాల్ సింగ్ జునే చోటు, చున్నిలాల్, తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి అక్రమ ఆయుధాలకు సంబంధించిన కేసులను వారిపై నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో వారిని అదుపులోకి తీసుకుని, వారిచ్చిన సమాచారం మేరకు పోలీసు బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలలో పలు ప్రదేశాలకు వెళ్ళి సాక్ష్యాలు సేకరించారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బర్వాణి జిల్లా, వర్గ తాహసీల్, ఉమర్టీ గ్రామంలో అక్రమ ఆయుధాలు తయారు చేసే కేంద్రంపైన దాడి చేసి 4 పిస్తోల్స్, 2 తూటాలు, తుపాకులు తయారు చేయడానికి ఉపయోగించే యంత్ర పరికరములను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

అత్యంత చాకచక్యంగా అంతరాష్ట్ర ఆయుధాల ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మొత్తం 22 తుపాకులు, 97 తూటాలు, 31 కేజీల గంజాయి, 2 కార్లు స్వాధీనం చేసుకొన్నందుకు అనంతపురం పోలీసులను ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి అభినందించి, రూ.25,000 ల‌ నగదు రివార్డు ప్రకటించారు.