సీఎం యోగి కాషాయ దుస్తులు ధరించడం మానేయాలి.. రోజూ మతం గురించి మాట్లాడొద్దు – కాంగ్రెస్ నాయకుడు హుస్సేన్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వస్త్రధారణపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహారాష్ట్ర మాజీ మంత్రి హుస్సేన్ దల్వాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి కాషాయ దుస్తులు ధరించడం మానేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించాలంటే ఆధునిక దుస్తులను ధరించడం అలవర్చుకోవాలని అన్నారు.
వచ్చే నెలలో యోగి ముంబయి పర్యటన..
వచ్చే నెలలో (ఫిబ్రవరి) లక్నోలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ క్రమంలో దేశ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల నిమిత్తం దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పర్యటించననున్నారు. ఈ సందర్భంగా దల్వాయి మాట్లాడుతూ.. మహారాష్ట్ర నుంచి యోగి పరిశ్రమలను తీసుకెళ్లకుండా తన సొంత రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు దిశగా కృషి చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. పరిశ్రమలకు మహారాష్ట్ర మంచి సదుపాయలను కల్పించింది. కాబట్టి ఇక్కడి నుంచి పరిశ్రమలను తీసుకోకుండా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలి. వాటి అభివృకి అవసరమైన అనుకూల వాతావరణాన్ని కల్పించండి. పరిశ్రమ అనేది ఆధునికతకు ప్రతీక ..యూపీ సీఎం కొంత ఆధునికతను పెంపొందించుకోవాలి. ప్రతి రోజు మతం గురించి మాట్లాడకండి. కాషాయ బట్టలు ధరించడం మానేయండి. కొంచెం మోడ్రన్ గా ఉండటానికి ప్రయత్నించండి. ఆధునిక ఆలోచనలను అలవర్చుకోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి.. రాష్ట్రంలోని వివిధ రంగాలలలో ఉన్న అవకాశాలను వారికి అందించేందుకు స్వయంగా సీఎం రంగంలోకి దిగారు. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, బ్యాంకర్లతో పాటు ప్రముఖ సినీ ప్రముఖులతో గురువారం సమావేశమవనున్నారు. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబయి నుంచి దేశీయ రోడ్లను ప్రారంభించనున్నారు.





