భారత తొలి మహిళా ప్రధాని ఫోటో ఎక్కడ? ఐద్వా సదస్సులో పాకిస్థాన్ మాజీ ప్రధాని భుట్టో చిత్రాలకు ప్రాధాన్యం!
ఈ ఏడాది జనవరి 6వ తేదీ నుంచి 9 వరకు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు.. తమ ప్రచార ఫ్లెక్సీలు, బోర్డులలో పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో ఫొటోలను పెట్టారు. కనీసం మన భారతదేశ మహిళా తొలి ప్రధాని ఇందిరాగాంధీ చిత్రాన్ని ఎక్కడా ఉంచలేదు. తిరువనంతపురంలోని పాలయం మార్కెట్ ముందు భుట్టో చిత్రంతో ఒక పెద్ద బోర్డును సంఘ సభ్యులు ఏర్పాటు చేశారు. దీనిలో 9 విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్‌లు పొందిన మహిళ, పాకిస్తాన్ మొదటి మహిళా ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో అని ఆ చిత్రానికి క్యాప్షన్ ఇచ్చారు. అమరవీరుల మండపం ఉన్న ప్రదేశంలో దీన్ని ఉంచారు. దీంతోపాటు సిపిఎం మహిళా విభాగం ఆ ప్రదేశానికి “బెనజీర్ భుట్టో స్క్వేర్” గా పేరు మార్చింది. ఈ విషయాలను చూసిన నెటిజన్లు భారతీయులంటే అంత చులకనా అంటూ మండిపడుతున్నారు. భారత దేశంలో ఎంతో మంది మహిళలు గొప్ప పోరాటాలు చేశారని వారందరూ కనిపించటం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. కనీసం భారత దేశంలో ఉన్నత పదవులు అలంకరించిన వారిని కూడా స్మరించుకోకవడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దేశం ఎటు పోతోందంటూ ప్రశ్నిస్తున్నారు.