News

సిద్ధేశ్వర స్వామిజీ శివైక్యం.. చివరి చూపు కోసం తరలి వచ్చిన వేలాది మంది భక్తులు

385views

నడిచే దేవుడిగా పేరుగాంచిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన విజయపుర జ్ఞానయోగాశ్రమ శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర స్వామిజీ శివైక్యం చెందారు..  స్వామీజీ అంతిమ దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. విజయపుర నగరంలోని సైనిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో అంతిమ దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేయగా, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అంతిమ దర్శనానికి వచ్చారు. అయితే మరణాంతరం తన దేహాన్ని దహనం చేయాలని తన చివరి వీలునామాలో ఆయన రాశారు. ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, వేలాది భక్తుల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్వామీజీ అంత్యక్రియలను పూర్తి చేశారు.

దహనం చేయమని స్వామీజీ వీలునామా..
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర స్వామీజీ తన మరణానంతరం ఖననానికి బదులు దహనం చేయమని వీలునామా రాశారు. అస్తికలను నది లేదా సముద్రంలో కలపాలని చెప్పారు. అంత్యక్రియలను నిరాడంబరంగా జరిపించాలని సూచించారు. వీటితోపాటు భక్తులకు చివరి సందేశం కూడా ఇచ్చారు. 2014లో గురిపౌర్ణమి నాడు ఈ వీలునామాను స్వామీజీ రాశారు.

స్వామీజీ జీవిత సందేశం ఇదే..
“జీవితం అనేది అనుభవాల సమూహం. నిరంతర ఆలోచన, నిజాన్ని శోధించడం వల్ల అది పరిపూర్ణం అవుతుంది. ధర్మాన్ని పాటించడం వల్ల అది మీకు కలుగుతుంది. ఆత్మసంతృప్తికి అది ఒక కారణం… నాది ఓ సాధారణ జీవితం. గురుదేవ్​ దాన్ని సృష్టించారు. దాన్ని స్వీకరించినవారు ఈ దేశంలో ఉన్న గౌరవనీయ వ్యక్తులు. శ్రేయోభిలాషులు, దయా హృదయం కలిగిన వారు, సాధారణ వ్యక్తులు. ప్రకృతిలా నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవితంలో నాకు లభించిన ప్రతిదానికీ నేను కృతజ్ఞుడ్ని. మబ్బులు కరగడం, పరదాలు తొలగిపోవడం, దీపాలు ఆరిపోవడం ఎలానో జీవితం కూడా ఓరోజు ఆగిపోతుంది. అనంతరం శూన్యం, నిశ్శబ్దం మాత్రమే మిగులుతాయి. దశాబ్దాలుగా బతకడంలో ఇసుమంతైనా నిజం లేదు. ఈ విషాయాన్ని నేను చూశాను, అనుభవించాను. నా జీవితం ఆగిపోయేముందు ఇవన్నీ కృతజ్ఞతతో గుర్తుతెచ్చుకోవాలి. అందుకే ఈ వీలునామా. ఈ లోకంలో నిజం, అబద్దం అనేది లేదు. సహజం, అసహజం అనేది లేదు. నేను నువ్వు అనే తేడా లేదు. అంత్యం ప్రణమాంజలి” అని సందేశం ఇచ్చారు.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..
ప్రభుత్వ లాంఛనాలతో శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర స్వామీజీ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం నిర్వహించారు. స్వామీజీ పార్థివదేహాన్ని జ్ఞాన యోగాశ్రమంలో ఉంచారు. భక్తుల చివరి దర్శనం కోసం సైనిక్​ పాఠశాల పరిసరాలలోకి మార్చనున్నారు. ఈ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా భక్తులు సంయమనం పాటించాలని సీఎం కోరారు.