ArticlesNews

పోరాట యోధురాలు సావిత్రీబాయి పూలే!

105views

పంతొమ్మిదో శతాబ్దంలో భారత దేశంలో మహిళా విద్య, మహిళా సాధికారత సాధన కోసం కీలక భూమిక పోషించిన వారిలో ముఖ్యులు జ్యోతి రావు పూలే సతీమణి, ప్రముఖ భారతీయ సంఘ సంస్కర్త, విద్యావేత్త, కవయిత్రి సావిత్రీబాయి పూలే అని చెప్పవచ్చు. ఆమె చేసిన నిరుపమాన సేవలను నేటికీ భారతీయులు స్మరించుకుంటున్నారంటే… సావిత్రీబాయి గొప్పతనం అంతాఇంతా కాదు.  జనవరి 3వ తేదీ ఆమె జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

రైతు కుటుంబంలో పుట్టి.. చదువుపై మక్కువ పెంచుకుని..
మహారాష్ట్రలోని ప్రస్తుత సతారా జిల్లా నైగావ్ పట్టణంలో 1831వ సంవత్సరం జనవరి మూడో తేదీన ఓ రైతు కుటుంబంలో సావిత్రి బాయి పూలే జన్మించారు. ఆమె తల్లిదండ్రుల పేర్లు ఖండోజి నెవెషే పాటిల్, లక్ష్మీ. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చిన్న వయసులోనే వివాహం చేసేవారు. దీంతో 1840 సంవత్సరంలో సావిత్రీబాయి 12 ఏళ్ల వయసులోనే జ్యోతి రావు పూలేతో వివాహం జరిగింది. చిన్ననాటి నుంచి ఆమెకు చదువంటే ఎంతో ఆసక్తి ఉండటంతో తన భర్త జ్యోతి రావు పూలే సామాజిక కార్యకర్త, సంఘ సంస్కర్త కావడంతో ఆమెను చదువుకోమని ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనే చదవడం, రాయడం నేర్పించారు. ఆమె సాధారణ పాఠశాల నుంచి మూడు, నాలుగవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి బోధన పట్ల మక్కువ పెంచుకున్నారు. అహ్మద్ నగర్లోని ఒక సంస్థలో చేరి శిక్షణ పొందారు. సావిత్రీ బాయి పూలే అన్ని ప్రయత్నాలలో జ్యోతీ రావు పూలే ఆమెకు అండగా నిలిచారు.

బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి సత్కారం..
1848 సంవత్సరంలో జ్యోతీ రావు పూలే, సావిత్రీ బాయి పూలేలు కలిసి పూణేలో బాలికల విద్యాభివృద్ది కోసం మొదటి సారిగా పాఠశాలను ప్రారంభించారు. ఇందుకు కుటుంబం నుంచి, సంఘం నుంచి వారు బహిష్కరించబడినప్పటికీ వెనుకంజ వేయకుండా సంకల్ప బలంతో ముందుకు సాగిపోయారు. ఇంత ధృఢ నిశ్చయంతో వున్న దంపతులకు వారి స్నేహితులు సాయం చేశారు. పాఠశాల ప్రారంభించడానికి తమ ప్రాంగణాన్ని వినియోగించుకోమని స్థలం కూడా వారే ఇచ్చారు. ఇక ఆ తర్వాత సావిత్రి బాయి పూలే ఈ పాఠశాలకు ప్రథమ ఉపాధ్యాయురాలుగా వ్యవహరించారు. 1852 సంవత్సరంలో ఆమె ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పేరు తెచ్చుకున్నారు. విద్యా రంగంలో సావిత్రీ బాయి చేసిన కృషికి గుర్తింపుగా బ్రిటీష్‌ ప్రభుత్వం పూలే కుటుంబాన్ని సత్కరించింది. మహిళా హక్కులు, గౌరవం, ఇతర సామాజిక సమస్యలపై వారికి అవగాహన కల్పించేందుకు సావిత్రీ బాయి పూలే…. మహిళా మండలిని కూడా నెలకొల్పారు. అంతేకాదు వితంతువులకు శిరోముండనం చేసే ఆచారాన్ని వ్యతిరేకిస్తూ ముంబై, పూణే నగరాలలో క్షురకుల సమ్మె నిర్వహించడంలో ఆమె విజయం సాధించారు. నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన ఆమె బాల్య వితంతువులకు విద్యను అందించడం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. బాల్య వివాహాలు, సతీ ప్రాతానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కుల, లింగ ఆధారిత వివక్షను నిర్మూలించడంలో ఆమె చురుకుగా పని చేశారు.

అవమానాలు భరించి… ఆశయం వైపు కదిలి…
పాఠశాల నిర్వహణకు సంబంధించి విరాళాలు సక్రమంగా అందక పోవడం, పాఠ్యాంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం వంటి పలు కారణాలతో పూలే దంపతులు నిర్వహిస్తున్న మూడు పాఠశాలలు 1858 సంవత్సరంలో మూతబడ్డాయి. అయినప్పటికీ…. ఎక్కడా అధైర్య పడకుండా పూలే దంపతులు అణగారిన ప్రజలను విద్యావంతులను చేసే బాధ్యతను తమపై ఉందన్న ధృఢ సంకల్పంతో ముందుకు సాగారు. ఈ బృహత్ ప్రయత్నంలో ముందడుగు వేస్తూ ….18 పాఠశాలలను తెరిచి వివిధ కులాల పిల్లలకు విద్యా బోధన చేశారు. ఇది గిట్టని కొందరు సావిత్రీ బాయి పూలేకు అనేక అవరోధాలు, అవమానాలకు గురిచేశారు. అయినా.. అటువంటి వాటిని ఆమె లెక్క చేయలేదు. ఈ దశలోనే ఆమెతో మరి కొందరు సంఘ సంస్కర్తలు చేతులు కలిపారు. 1855 సంవత్సరంలో పూలే దంపతులు రాత్రి వేళ నిర్వహించే పాఠశాలను కూడా ప్రారంభించి విద్యా బోధన చేశారు. పాఠశాలల నుండి పిల్లలు చదువుకు అర్ధరంతంగా స్వస్తి చెప్పకుండా స్టైఫండ్ కూడా పూలే దంపతులు ఇచ్చేవారు. విద్య ప్రాముఖ్యత పట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు సావిత్రీ బాయి పూలే తరచూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించేవారు.

భర్త చితికి నిప్పు అంటించిన భార్యగా చరిత్రలో నిలిచి…
అంటరానితనం, కుల వ్యవస్థను నిర్మూలించడం, అట్టడుగు కులాల ప్రజలకు సమాన హక్కులు కల్పించడం, హిందూ కుటుంబ జీవితాలను సంస్కరించడం వంటి కార్యక్రమాల్లో సావిత్రీ బాయి పూలే తన భర్తతో కలిసి తీవ్రంగా కృషి చేశారు. అంటరాని వారి నీడను అపవిత్రమైనదిగా భావించి దాహంతో ఉన్న వారికి నీరు అందించడానికి కూడా ఇష్టపడని ఆ కాలంలో ఈ పుణ్య దంపతులు అంటరాని వారి కోసం తమ ఇంటిలో ఏకంగా ఓ నీటి బావినే తవ్వించారు. అంతే కాకుండా స్త్రీలు, శూద్రులు, దళితులు, ఇతర అణగారిన వర్గాలు దోపిడీకి గురి కాకుండా విముక్తి కల్పించడం కోసం 1873వ సంవత్సరంలో ”సత్య సోధక్ సమాజ్” అనే సామాజిక సంస్కరణ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో అనేక సామాజిక వర్గాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థ మహిళా విభాగానికి సావిత్రీ బాయి పూలే నాయకత్వం వహించారు. 1890 నవంబర్ 28 వ తేదీన జ్యోతీ రావు పూలే మరణించారు. ఈక్రమంలో తన భర్త జ్యోతీ రావు పూలే చితికి భార్య స్వయంగా నిప్పు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. సావిత్రీ బాయి చర్యతో కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారత దేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు అంటించిన తొలి సంఘటన ఇదే కావడం గమనార్హం. సమాజంలోని పాతకాలపు చెడులను అరికట్టడంలో సావిత్రీ బాయి పూలే చేసిన అవిశ్రాంత కృషి, ఆమె చేపట్టిన సంస్కరణలు తరతరాలకు స్ఫూర్తి నిస్తూనే ఉన్నాయి.

శిశు హత్యలను నిషేధించాలని పోరాటం..
1863 సంవత్సరంలో సావిత్రీ బాయి పూలే సమాజానికి ఉపయోగ పడే మరొక గొప్ప సంస్కరణ చేపట్టారు. శిశు హత్యలను నిషేధించాలనే సదాశయంతో “బాల్ హత్య ప్రతి బంధక్ గృహ ” పేరుతో దేశంలోనే మొదటి సారిగా శిశు హత్య నిషేధ గృహాన్ని ప్రారంభించారు. గర్భిణీ బ్రాహ్మణ వితంతువులు, అత్యాచార బాధితులు తమ పిల్లలను సురక్షితమైన ప్రదేశంలో ప్రసవించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. 1874 సంవత్సరంలో పూలే దంపతులు….. కాశీ బాయి అనే బ్రాహ్మణ వితంతువుకు పుట్టిన బిడ్డను దత్తత తీసుకుని తద్వారా సమాజంలోని ప్రగతి శీల ప్రజలకు బలమైన సందేశాన్ని పంపారు. వారి దత్తపుత్రుడు ఒక వైద్యుడుగా ఎదిగారు. ఆమె దత్త పుత్రుడు యశ్వంత్ రావు వైద్యుడిగా పేద ప్రజలకు గణనీయమైన సేవలు అందించారు. కుమారుడు నిర్వహిస్తున్న వైద్య చికిత్సలో సావిత్రీ బాయి పూలే చేయూత అందించేవారు. కాలక్రమంలో రోగులకు సేవలు అందిస్తున్న సందర్భంలో సావిత్రీ బాయి పూలే కూడా వ్యాధి బారిన పడి 1897 మార్చి 10వ తేదీ తుది శ్వాస విడిచారు. సావిత్రీబాయి భౌతికంగా దూరమైనప్పటికీ భారత దేశ చరిత్ర పుటల్లో ఆమె ఎప్పుడూ నిలిచిఉంటారు. దీంతోపాటు 1983 సంవత్సరంలో పూణే సిటీ కార్పొరేషన్ ఆమె గౌరవార్థం ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసింది. 1998 మార్చి 10వ తేదీన ఇండియా పోస్టు ఒక తపాలా స్టాంపు కూడా విడుదల చేసింది. ఇక ఆమె మరణించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ సామిత్రీబాయి జయంతి, వర్ధంతి కార్యక్రమాలు వాడవాడలా ఇంకా నిర్వహిస్తున్నారంటే ఆమె చేసిన సేవలకు గుర్తింపు అని చెప్పవచ్చు.