NewsProgramms

వైభవంగా తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు

282views

తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామికి స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల వైకుంఠ ద్వారాన్ని సోమవారం అర్ధరాత్రి 12.05 గంటల తర్వాత తెరవడంతో శ్రీవారి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. తొలుత శ్రీవారికి నిర్వహించే కైంకర్యాలు పూర్తి చేసిన అర్చకులు అనంతరం దర్శనాలను ప్రారంభించారు. ముందుగా అత్యంత ప్రముఖులు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. సోమ వారం ఉదయం 6 గంటల నుంచే సామాన్య భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. ముక్కోటి ఏకాదశి రోజు స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ముందు గానే ఆన్లైన్లో రూ. 300, ఆఫ్‌లైన్లో ఎస్ఎస్ఓ టోకెన్లు పొందారు. సోమవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు సమయానుసారంగా నిర్దేశిత టోకెన్లు కలిగిన భక్తులను శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. శ్రీవారిని గత శనివారం 78,460 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.4.03 కోట్ల హుండీ కానుకలు లభించాయి. ఇక మరోవైపు గదులు దొరకని భక్తులు పీఏసీలు, షెడ్లలో సేదతీరుతున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. దీని కోసం పది టన్నుల సంప్రదాయ పుష్పాలు, ఒక టన్ను కట్ ఫ్లవర్స్ వినియోగించారు.