
ఇస్లామాబాద్: 70 ఏళ్ళుగా పాకిస్తాన్ దేశ రాజకీయాల్లో సైన్యం జోక్యం చేసుకుంటున్నదని ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా అంగీకరించారు. ఈ నెల 29 న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో బజ్వా చేసిన ప్రసంగం పాకిస్తాన్‌లో కలకలం రేపుతున్నది.
ఇప్పటివరకు రాజకీయాల్లో సైన్యం మితిమీరిన జోక్యం చూశామని, ఇకముందు అలా జరుగకుండా చూడాల్సిన బాధ్యత ఆర్మీపై ఉన్నదని బజ్వా హితవు పలికారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని గత ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకున్నట్టు బజ్వా వెల్లడించారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులకు మరీ ముఖ్యంగా ఇమ్రాన్‌ఖాన్‌కు ఆయన పేరు లేవనెత్తకుండానే కొన్ని సలహాలిచ్చారు.
సైన్యం గురించి మాట్లాడేటప్పుడు పాకిస్తాన్ రాజకీయ నాయకులు తరచుగా నోరు జారుతున్నారని జనరల్ బజ్వా విచారం వ్యక్తం చేశారు. ఇకముందు మంచి పదాలను ఎన్నుకోవాలని కోరారు. ఇటీవలి కాలంలో సైన్యంపై రాజకీయ నేతలు వాడిన భాష అభ్యంతరకరంగా ఉన్నదని స్పష్టం చేసారు.
సైన్యం గురించి తప్పుడు విషయాలు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. సైన్యంపై విమర్శలు చేసే సమయంలో స్వరం పెంచుతున్నారని మండిపడ్డారు. తన ప్రభుత్వం పడిపోవడంలో మిలిటరీ పాత్ర ఉన్నదని ఇమ్రాన్‌ఖాన్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
Source: Nijamtoday