News

”26/11′ కుట్రదారులకు శిక్ష పడాల్సిందే..

65views

న్యూఢిల్లీ: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో భీకర ఉగ్రదాడి జరిగి సరిగ్గా 14 ఏళ్ళు. అమాయక ప్రజలపై పాకిస్తానీ ముష్కరులు బాంబు పేలుళ్ళు జరిపి అనేక మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ మారణహోమం తాలూకు భయానక క్షణాలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. కానీ, ఆ ఘోరానికి పాల్పడిన వారు మాత్రం శత్రుదేశంలో స్వేచ్ఛగా తిరుగుతూనే ఉన్నారు. వారిని చట్టం ముందుకు తీసుకొస్తేనే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు.

ముంబయి పేలుళ్ళు జరిగి 14 ఏళ్ళు అవుతున్న సందర్భంగా జైశంకర్‌ ట్విటర్‌ వేదికగా మృతులకు నివాళులర్పించారు. “మానవాళిని ఉగ్రవాదం భయపెడుతోంది. ఈ రోజు 26/11 సందర్భంగా భారత్‌తో కలిసి యావత్ ప్రపంచం ఆ మారణహోమం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటోంది. ఈ దాడులకు కుట్ర పన్నిన వారిని కచ్చితంగా చట్టం ముందుకు తీసుకొచ్చి శిక్ష విధించాలి. ఉగ్రవాదం కారణంగా బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాల్సిందే” అని ఆయన రాసుకొచ్చారు. ఈ సందర్భంగా దాడులకు సంబంధించిన చిత్రాలతో కూడిన ఓ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియో చివర్లో మోదీ సందేశం కూడా ఉంది. “ఉగ్రదాడి ఒక్కటైనా.. ఎన్నో జరిగినట్టే. ఒక్క ప్రాణం పోయినా ఎన్నో ప్రాణాలను కోల్పోయినట్టే. అందువల్ల ఉగ్రవాదాన్ని సమూలంగా తుడిచిపెట్టేంతవరకూ మేం విశ్రమించం” అని ఇటీవల ఓ వేదికపై మోదీ చెప్పిన సందేశాన్ని ఈ వీడియోకు జత చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి