
న్యూఢిల్లీ: భారతదేశం తన సాంస్కృతిక వైవిధ్యాన్ని వేడుకగా జరుపుకోవడం ఒక్కటే కాకుండా తన చరిత్రలో భాగం కానటువంటి అజ్ఞాత వీరుల, వీర వనితల ఘనతను కూడా గుర్తిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
సంవత్సరం పాటు నిర్వహించిన లచిత్ బర్ ఫూకన్ 400వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటూ లచిత్ బర్ ఫూకన్ మొఘలులను ఓడించిన అస్సాంకు చెందిన అహోమ్ సామ్రాజ్యపు రాయల్ ఆర్మీకి జనరల్ గా ప్రసిద్ధికెక్కారని, ఔరంగజేబ్ నాయకత్వం లోని ముఘలుల రాజ్య విస్తరణ ఆకాంక్షలను రాయల్ ఆర్మీ విజయవంతంగా అడ్డుకొందని గుర్తు చేశారు.
లచిత్ బర్ ఫూకన్ ఘన కార్యాలు అస్సాం చరిత్రలో ఒక వైభవోపేతమైనటువంటి అధ్యాయం అని పేర్కొంటూ దాస్యం తాలూకు మనస్తత్వం బారి నుండి తప్పించుకొని భారతదేశం తన వారసత్వం పట్ల గర్వపడే మన:స్థితి కి చేరుకొందని ప్రధాని తెలిపారు.
‘‘భరతమాత అమరపుత్రులలో లచిత్ బర్ ఫూకన్ వంటి వారు ‘అమృత కాలం’ తాలూకు సంకల్పాలను నెరవేర్చుకోవడంలో ఒక ప్రేరణగా నిలుస్తారు. వారు మన చరిత్ర విశిష్టతను, గుర్తింపును మనకు ఎరుకపరుస్తారు. అంతేకాక మనలను మనం దేశానికి అంకితం చేసుకొనేందుకు కూడా వారు ఉత్తేజాన్ని అందిస్తారు’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Source: Nijamtoday