News

అసొం-మేఘాలయ వివాదం.. పెట్రోల్‌ కోసం కి.మీల మేర జనం బారులు..

361views

గువాహటి: అసొం, మేఘాలయ రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. మేఘాలయకు ఇంధనాన్ని సరఫరా చేయబోమంటూ ‘ది అస్సాం పెట్రోలియం మజ్దూర్‌ యూనియన్‌’ ప్రకటించడంతో అక్కడి వాహనదారులు ఒక్కసారిగా పెట్రోలు బంకులవైపు పరుగులు తీశారు. పెట్రోల్‌ కొరత ఏర్పడుతుందనే భయంతో ముందుగానే సరిపడా ఇంధనాన్ని నింపేందుకు పోటీ పడుతున్నారు. దీంతో బంకుల ఎదుట కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. వాహనదారులను అదుపు చేసేందుకు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

రెండు రాష్ట్రాల సరిహద్దులో మంగళవారం జరిగిన కాల్పుల్లో ఐదుగురు మేఘాలయ పౌరులతో సహా, అసొంకు చెందిన అటవీశాఖ అధికారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో మేఘాలయ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. తమవారిని అక్రమంగా పొట్టన పెట్టుకున్నారంటూ అసొం నుంచి వస్తున్న ట్రక్కులు, లారీలపై మేఘాలయ వాసులు దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో తమ వాహనాలకు ప్రమాదం పొంచి ఉందని పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేసే ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ తదితర కంపెనీలకు ఏపీఎంయూ సమాచారం అందజేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి