
మంగుళూరు: కర్ణాటకలోని మంగుళూరులో జరిగిన ఆటో రిక్షా పేలుడు కేసులో నిందితుడి ఆధారాలను సేకరించిన పోలీసులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపుతో నిందితుడు షారీక్‌కు సంబంధాలు ఉన్నట్టు తేల్చారు. ఈ క్రమంలో కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగిస్తున్నట్టు కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ మీడియాకు వెల్లడించారు.
ఇటీవల కదులుతున్న ఆటోలో పేలుళ్లు సంభవించిన విషయం విదితమే. దీంతో అక్కడ భారీగా పొగలు కమ్ముకున్నాయి. అనంతరం వెహికల్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ పేలుడు ఘటన అంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘటనను మొదట ప్రమాదంగా భావించారు.
కానీ, ఆదివారం డీజీపీ ప్రవీణ్ మాట్లాడుతూ ఈ పేలుళ్లతో ఉగ్రవాదులకు సంబంధం ఉందని తేల్చారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. తక్కువ సామర్థ్యం ఉన్న ఐఈడీ పేలినట్టు పోలీసులు నిర్ధారించారు. అయితే, నిందితుడు షారిక్ ఆటోలో కుక్కర్‌లో బాంబును తరలిస్తుండగా ఈ పేలుడు జరిగింది.
ప్రేమ్‌రాజ్ పేరుతో ఆధార్ కార్డు
24 ఏళ్ళ నిందితుడు శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లికి చెందిన వ్యక్తి. అయితే, పేలుడు తర్వాత అతని వద్ద హుబ్బళికి చెందిన ప్రేమ్ రాజ్ హుతాగి పేరుతో ఆధార్ కార్డును పోలీసులు కనుగొన్నారు. గతంలో ఓ ఉగ్రవాద సంబంధం కేసులో అరెస్ట్ అయి, హైకోర్టు నుండి బెయిల్ పొందిన తర్వాత వేర్వేరు హిందూ పేర్లతో కన్యాకుమారి, కోచి, కోయింబత్తుర్, మైసూరులో ఆశ్రయం తీసుకున్నాడని వెల్లడైనట్టు రాష్ట్ర హోమ్ మంత్రి ఆరాగా జ్ఞానేంద్ర తెలిపారు.
పేలుడు జరిగిన సమయంలో మైసూరులోని మోహన్ కుమార్ ఇంట్లో ఉంటున్నాడు. అక్కడనే బాంబు తయారీకి సంబంధించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను బళ్లారికి చెందిన ఓ హిందూ పేరుతో సిమ్ కార్డు వాడుతున్నట్టు పోలీసులు కనుగొన్నారు. కోయింబత్తుర్‌లోని ఇషా ఫౌండేషన్‌లో గల శివుడి స్థూపం బొమ్మను తమ వాట్స్ అప్ బొమ్మలో ఉంచాడు.
మైసూర్‌లో ఉన్న సమయంలో ఉర్దూ వాసనలు లేకుండా కన్నడంలోనే మాట్లాడేవారని, తాను ముస్లిం అని బైట పడకుండా ఉండేందుకు అన్ని హిందూ పండుగలను ఎంతో ఉత్సాహంతో జరుపుకొనేవాడని పోలీసులకు వెల్లడైనది.
Source: Nijamtoday





