న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జీ 20 కూటమి దేశాల సదస్సుకు హాజరవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇండొనేసియా బయల్దేరి వెళుతున్నారు. ఇండొనేసియాలోని బాలిలో 15, 16 తేదీల్లో జరిగే 17వ జీ 20 శిఖరాగ్రంలో మూడు ముఖ్యమైన సెషన్స్‌లో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్ స్కొల్జ్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు కూడా హాజరవనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడం లేదు.
అధ్యక్ష బాధ్యతలు భారత్‌కు…
20 దేశాల కూటమి అయిన జీ 20 18వ సదస్సుకు 2023లో భారత్ అధ్యక్షత వహించనుంది. బాలి సదస్సులో ఇండొనేసియా నుంచి సారథ్య బాధ్యతలను భారత్ అందుకోనుంది.
సునాక్‌తో ప్రత్యేకంగా భేటీ!
జీ 20 సదస్సుకు హాజరయ్యే దేశాధినేతలతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపే అవకాశాలున్నాయి. దీంతో అందరి దృష్టి భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో మోదీ భేటీపై ఆసక్తి నెలకొంది. అయితే వీరిద్దరి మధ్య భేటీ ఉంటుందో లేదో ఇరుపక్షాలు కూడా స్పష్టం చేయలేదు.