News

ఏడీ-1 మిస్సైల్‌ ప్రయోగం విజయవంతం

331views

భువనేశ్వర్‌: స్వదేశీ పరిజ్ఞానంతో.. భారత సైన్యం అమ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరబోతోంది. ఐదువేల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే శత్రు క్షిపణులను తునాతునకలు చేసేలా ఏడీ-1 మిస్సైల్‌ను డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ రూపొందించింది. ఈ మేరకు బుధవారం ఒడిశా తీరంలో జరిపిన రెండో దశ ప్రయోగం విజయవంతం అయినట్టు డీఆర్‌డీవో ప్రకటించింది.

బాలిస్టిక్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ షీల్డ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా.. రెండు దశల అభివృద్ధి కార్యక్రమంగా ఏడీ-1 మిస్సైల్‌ను డీఆర్‌డీవో రూపొందించింది. గతంలో మొదటి దశ ప్రయోగంలో.. 2 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకుంది ఈ మిస్సైల్‌. అయితే.. బుధవారం జరిగిన ప్రయోగంలో ఏకంగా ఐదు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకోగలిగిందని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ చైర్మన్‌ సమీర్‌ కామత్‌ వెల్లడించారు.

మన రాడార్లు దానిని(శత్రువు క్షిపణిని) పసిగట్టగానే.. AD-1 దానిని ట్రాక్ చేస్తుంది. ఇది ప్రధానంగా ఎండో-వాతావరణానికి సంబంధించినది. కానీ, తక్కువ ఎక్సో-వాతావరణ ప్రాంతంలో కూడా పనిచేస్తుంది అని డీఆర్‌డీవో తెలిపింది. బాలిస్టిక్‌ క్షిపణులు, తక్కువ ఎత్తులో ప్రయాణించే ఎయిర్‌క్రాఫ్ట్‌లను నాశనం చేసే సామర్థ్యం ఏడీ-1కి ఉంది. సుదూర ప్రాంతాల నుంచి శత్రు దేశాల లక్ష్యాలను ఈ మిస్సైల్‌ నాశనం చేస్తుంది. 2025 నాటికి పూర్తి స్థాయి సామర్థ్యంతో అందుబాటులోకి తెస్తామని డీఆర్‌డీవో ప్రకటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి