News

అమరావతిలో ప్రసాదం బదులుగా డబ్బులు పంచిన పూజారి!

370views

అమరావతి: దేవుడిని దర్శించుకున్న భక్తుడికి పూజారి ప్రసాదం ఇస్తాడు. అయితే, మహారాష్ట్రలోని అమరావతిలో ఉన్న కాళీమాత ఆలయంలో పూజారి భక్తులకు ప్రసాదం బదులు డబ్బులు పంచారు. సోమవారం రోజున దీపావళి పండగ సందర్భంగా భక్తులకు ప్రసాదం బదులు డబ్బులు పంచారు.

కాళీమాత ఆలయంలో దీపావళి పండగ సందర్భంగా సోమవారం రాత్రి 11 నుంచి 2 గంటల వరకూ పూజారి శక్తి మహారాజ్‌ భక్తులకు డబ్బులు పంచారు. పది రూపాయల నోట్లను పెద్ద గిన్నెలో ఉంచి, ఒక్కొక్కరికీ రెండు లేదా మూడు నోట్లు పంపిణీ చేశాడు. ఈ డబ్బు (ప్రసాదం) పొందడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దాంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పండుగ రోజు భక్తులకు డబ్బులు పంచితే మంచిదని పూజారి తెలిపారు.

అమరావతి నగరంలోని ప్రధాన హిందూ శ్మశానవాటిక పక్కన ఏళ్ళనాటి కాళీమాత ఆలయం ఉంది. ఈ ఆలయం 35-40 ఏళ్ళ కిందట పునరుద్ధరించబడింది. 1984లో కాళీమాత ఆలయ ప్రధాన పూజారి శక్తి మహారాజ్ దీపావళి రోజు రాత్రి బరాకత్ (ధన ప్రసాదం) పంచే పద్ధతిని ప్రారంభించారు. దీపావళి రోజు రాత్రి ఆలయానికి వచ్చే భక్తులపై కాళీమాత అనుగ్రహం ఉండేందుకు ధన ప్రసాదం పంపిణీ చేయమని శక్తి మహరాజ్ తెలిపారు.

కాళీమాత ఆలయంలో ప్రసాదం ఇవ్వడం 38 ఏళ్ళుగా కొనసాగుతోంది. దీపావళి రోజున ఇంట్లో లక్ష్మీపూజ అనంతరం రాత్రి పది గంటల నుంచి కాళీమాత ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాత్రి 11 గంటల నుంచి ఆలయంలో డబ్బు ప్రసాదం పంపిణీ చేస్తారు. రాత్రి రెండు గంటల వరకు భక్తులు కాళీమాతను దర్శించుకుని ఆశీర్వాదం పొందుతారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో సోమవారం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Source: ZEE TeluguNews

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి