News

హిందూ దర్శనీయ ప్రాంతాలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి..‌. ప్రధాని మోదీ

371views

ఉత్తరాఖండ్‌: హిందూ దర్శనీయ ప్రాంతాలెన్నింటినో గత ప్రభుత్వాలు దశాబ్దాల పాటు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయంటూ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. బానిస మనస్తత్వమే ఇందుకు ఏకైక కారణమంటూ దుయ్యబట్టారు. ఇది కోట్లాది మంది శ్రద్ధాళువుల విశ్వాసాలను గాయపరచడమే తప్ప ఇంకోటి కాదంటూ ఆక్షేపించారు.

మహిమాన్విత పూజనీయ స్థానాల గత వైభవాన్ని తాము ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తూ వస్తున్నామని చెప్పారు. కాశీ విశ్వనాథాలయం, అయోధ్య, ఉజ్జయినీ ఆలయాల్లో భారీ ఎత్తున చేపట్టిన పునర్నిర్మాణ పనులే ఇందుకు ఉదాహరణ అన్నారు. ‘‘కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలను కూడా నేరమన్నట్టుగా మాట్లాడేంతగా కొందరిలో బానిస మనస్తత్వం వేళ్ళూనుకుపోయింది. ఇతర దేశాల్లో ఉండే ఇలాంటి పూజనీయ స్థానాలను ప్రశంసించేదీ వాళ్ళే.

మన దేశంలో మాత్రం అలాంటి వాటిని చిన్నచూపు చూసేదీ వాళ్ళే. నిజానికి మన ఘన వారసత్వం మనకెంతో గర్వకారణం. వాటి పునరుద్ధరణకు చేసే ప్రయత్నాలు 21వ శతాబ్దపు నయా భారత్‌కు పునాది వంటివి’’ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఉత్తరాఖండ్‌ చేరుకున్న ఆయన ప్రఖ్యాత యాత్రా స్థలాలైన కేదార్‌నాథ్, హేమ్‌కుండ్‌ సాహిబ్‌కు రోప్‌వే ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. అనంతరం చైనా సరిహద్దుల సమీపంలో మనా గ్రామంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి