
న్యూఢిల్లీ: అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను భారత్‌కు అప్పగిస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నలకు పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ మొహసీన్ భట్ స్పందించేందుకు నిరాకరించారు.
ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ పాక్ తరఫున ఇద్దరు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఓ మీడియా సంస్థ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌ను భారత్‌కు అప్పగిస్తారా? అని ప్రశ్నించింది. దీంతో ఆయన మౌనం వహించారు.
ఇబ్రహీం, హఫీజ్ లు భారత భద్రతా ఏజెన్సీల మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ పాకిస్తాన్‌లో నివసిస్తున్నారని భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
మరో వైపు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఎప్పటికప్పుడు పాక్ ఉగ్రదాడుల అంశాన్ని భారత్ లేవనెత్తుతూ వస్తున్నది. హఫీజ్‌పై విచారణను వేగవంతం చేయాలని ఇటీవల భారత్ విజ్ఞప్తి చేయగా అమెరికాకు సైతం మద్దతు తెలిపింది. ఇటీవల జరిగిన యూఎన్ భద్రతా మండలి సమావేశంలో పాక్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా, భారత్ గట్టి సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా జనరల్ అసెంబ్లీ ఇంటర్‌పోల్ అత్యున్నత పాలకమండలి. దాని పనితీరుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఏడాదికోసారి సమావేశమవుతుంది. ఈ ఏడాది ఢిల్లీలో సమావేశం జరగ్గా, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశం నాలుగు రోజుల పాటు కొనసాగనున్నది.
ఇందులో 195 ఇంటర్‌పోల్ సభ్య దేశాల ప్రతినిధులు, మంత్రులు, దేశాల పోలీస్ చీఫ్‌లు, నేషనల్ సెంట్రల్ బ్యూరో చీఫ్‌లు, సీనియర్ పోలీసు అధికారులు పాల్గొంటారు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత భారత్‌లో ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశం జరుగుతున్నది. ఇంతకు ముందు చివరిసారిగా 1997లో జరిగింది.
Source: Nijamtoday